మణిరత్నం కలల ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’. కల్కి కృష్ణమూర్తి రచించిన ఈ నవలని ఏంజీఆర్ నుంచి కమల్ హాసన్ వరకూ ఎందరో సినిమాగా తీయాలని ప్రయత్నించారు, కానీ మణిరత్నం ఆ కలని సాకారం చేసుకుంటూ రెండు భాగాలు గా తీశారు. మొదటి భాగం గత ఏడాది వచ్చింది. ఇప్పుడు రెండో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇది చోళుల చరిత్ర. తొలి భాగం చూసిన తెలుగు ప్రేక్షకుల్లో చాలా మందికి ఆ పేర్లు, ప్రాంతాలు, వారి నేపధ్యాలు కొత్తగా కాస్త తికమకగా కూడా అనిపించాయి. అయితే విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తి, త్రిష పాత్రలతో ప్రయాణం అవుతూ మణిరత్నం మేకింగ్ ని ఆస్వాదించిన ప్రేక్షకులూ వున్నారు. మొదటి భాగంలో చాలా ప్రశ్నలతో పాటు..ఐశ్వర్యరాయ్ ద్విపాత్రభినయం..రెండో భాగంపై ఆసక్తిని పెంచాయి. మరి ఆ ప్రశ్నలకు సమాధానాలు రెండో భాగంలో దొరికాయా ? మణిరత్నం మ్యాజిక్ కొనసాగిందా ?
మొదటి భాగంలో జరిగిన కథని ఒకసారి గుర్తు చేసుకుంటే.. చోళ చక్రవర్తి సుందర చోళుడు (ప్రకాశ్‌రాజ్). ఆయనకు ఇద్దరు కుమారులు ఆదిత్య కరికాలన్ (విక్రమ్), అరుణ్మొళి వర్మన్ అలియాస్ పొన్నియిన్ సెల్వన్ (జయం రవి), ఒక కుమార్తె కుందవై (త్రిష). వందియదేవన్ (కార్తి) ఆదిత్య కరికాలన్ కు నమ్మిన బంటు. తన రాజ్యంలో ఎదో కుట్ర జరుగుతుందని గ్రహిస్తాడు ఆదిత్య. సుందర చోళుడిని తప్పించి మధురాంతకుడి (రెహమాన్)ని చక్రవర్తిని చేయాలనేది ఆ కుట్ర. ఈ కుట్రకు సూత్రధారి నందిని (ఐశ్వర్యా రాయ్). ఆమె పాండ్యుల మనిషి. ఈ క్రమంలో పొన్నియిన్ సెల్వన్, వందియదేవన్ పై శత్రు సైన్యం దాడి చేస్తుంది. సముద్ర మార్గంలో వెళుతున్న పొన్నియిన్ సెల్వన్ ఓడ ప్రమాదంలో మునిగిపోతాడు. ఆ సమయంలో అచ్చు నందిని పోలికలతో వున్న ఓ వృద్ధురాలు పొన్నియిన్ సెల్వన్ ని కాపాడుతుంది. అసలు ఆమె ఎవరు? అనే చోట మొదటి భాగం కథకు ఆసక్తికరమైన కామా పెట్టారు మణిరత్నం. అక్కడి నుంచే రెండో భాగం మొదలౌతుంది. మరి చోళులపై నందిని చేసిన కుట్ర ఫలించిందా? అసలు నందినికి చోళులపై పగ ఎందుకు ? నందిని రూపంలో వున్న ముసలావిడ ఎవరు ? ఆదిత్య, నందినిలా గతం ఏమిటి ? చివరికి చోళరాజ్యం ఏమైయింది ? అనేది రెండువ భాగం కథ.
పొన్నియిన్ సెల్వన్ తమిళరాజ్యాన్ని పాలించిన రాజుల చరిత్ర. చోళుల చరిత్ర. చోళులు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ రాజ రాజ చోళులు(అతడే పొన్నియిన్ సెల్వన్) అంటే.. తెలుగు చరిత్ర పుస్తకాల్లో విన్నపేరే. అయితే ఈ చరిత్రని కల్కి కృష్ణమూర్తి నవలగా రాయడానికి కారణం మాత్రం.. ఆదిత్య కరికాలన్ పాత్ర. అతని మరణం చరిత్రలో ఒక మిస్టరీ. చాలా ఊహాగానాలు వున్నాయి కానీ వాస్తవంగా ఆదిత్య ఎలా చనిపోయాడో ఎవరికీ తెలీదు. బహుసా ఆ చావు కారణం ఇలా అయ్యింటుదనే కోణంలో ఈ నవల ప్రారంభం అవుతుంది. నిజానికి ఈ నవల ఆరంభంలోనే ఆదిత్య చనిపోతాడు. అందుకే దీనికి పొన్నియిన్ సెల్వన్ అనే పేరు పెట్టారు కానీ ఆదిత్య కరికాలన్ అనలేదు.
అయితే నవలని సినిమాగా చేసే క్రమంలో మణిరత్నం స్క్రీన్ ప్లే పరంగా చాలా మార్పులు చేసుకున్నారు. ఆదిత్య పాత్రలో విక్రమ్ లాంటి నటుడిని తీసుకొని ఆ పాత్రని చాలా వీరోచితంగా చిత్రీకరించారు. నిజానికి మొదటి భాగం చూసిన ప్రేక్షకులకు అసలు హీరో ఆదిత్య కదా.. దీనికి పొన్నియిన్ సెల్వన్ అని ఎందుకు పేరుపెట్టారనే అనుమానం కూడా రేగుతుంది. తెలుగు లో కొందరు కనెక్ట్ కాలేకపోవడానికి ఇదీ ఒక కారణం. అయితే అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో రెండో భాగంలో తెలుస్తుంది.
ఈ కథలో డ్రామా అంతా ఆదిత్య, నందిని పాత్రల చుట్టూనే వుంది. దానినే ఎస్టాబ్లెస్ చేస్తూ వారి యవ్వనంలోని జరిగే సంఘటనలతో రెండో భాగం మొదలౌతుంది. పొన్నియిన్ సెల్వన్ ని సముద్రం రక్షించింది మందానికి( ఐశ్వర్యరాయ్ డబుల్ యాక్షన్) అని తెలియడం, నందని చోళులని అంతం చేయడనికిన్ కుట్ర చేయడం, పొన్నియిన్ సెల్వన్ బౌద్ధ క్షేత్రంలో ఆశ్రయం పొందడం, ఆదిత్యని నందిని తన స్థావరానికి రప్పించడం.. డ్రామాని నిదానంగా ముందుకు తీసుకువెళ్తాయి. మందాకిని పాత్రకి వున్న నేపధ్యం ఒక్క క్షణానికి .. ఆదిత్య, నందినిలా బంధానికి పెను ప్రమాదం తెచ్చినట్లు అనిపిస్తుంది. అయితే అంతలోనే పాండ్యరాజు పాత్ర రూపంలో ‘’హమ్మయ్య’’ అని ఊపిరి పీల్చుకునేలా చేస్తుంది. అయితే ఆ పాత్రకి ఇంకా లోతుగా వివరించి వుంటే బావుండేది. వారి గతాన్ని కూడా ఎదో గుహలో రాళ్ళ మీద గీసిన బొమ్మలతో చూపించేరే కానీ విజువల్ జోలికి వెళ్ళలేదు.
నిజానికి ఈ కథకు మందాకిని పాత్ర పరిచయమే ఒక విరామం. కానీ అదే మొదటి భాగానికి ముగింపు కావడం వలన రెండో భాగంలో విరామ ఘట్టం కోసం చాలా వెతుక్కోవాల్సి వచ్చింది. పొన్నియిన్ సెల్వన్ బౌద్ధ ఆశ్రమం నుంచి శత్రువులదాడిని తప్పుంచువెళ్ళే ఒక సాధరణ ఘట్టమే విరామంగా వేసుకున్నారు. రెండో భాగం చాలా వరకు తంజావూరు కోటలోనే జరిగిపోతుంది. ఇద్దరు యువరాజులని చంపడానికి పాండ్యులు ఎదురుచూడటం ఒకవైపు ఆసక్తిని పెంచితే… నందిని ఆదిత్యల ప్రేమ, పగ మరో ఆసక్తికరమైన అంశం. క్లైమాక్స్ కి ముందు నందిని, ఆదిత్య పడే ఘర్షణలో మణిరత్నం మార్క్ కనిపిస్తుంది. ఎంతో వీరోచితంగా కనిపించే ఆదిత్య.. తను సగం చచ్చిపోయిన మనిషిని చెప్పడం, ప్రాణ బిక్ష అడిగితే ఇవ్వలేని తాను అప్పుడే మనిషిగా చచ్చిపోయాయని ఆదిత్య తన మనసులోని వేదనని చెప్పే తీరు, నందిని కళ్ళలో కనిపించిన ప్రేమ పగ ప్రతీకారం.. మణిరత్నంకు మాత్రమే సాధ్యమైన మేకింగ్ అనిపిస్తుంది.
ముందుకుగా చెప్పుకున్నట్లు ఇదొక చరిత్ర. చాలా పాత్రలు, నేపధ్యాలు వున్న చరిత్ర. అందుకే ఒక సన్నివేశం తర్వాత దాని ఫ్లో వుండదు. ఒక సన్నివేశంలో కనిపించిన పాత్ర.. మళ్ళీ తెరపైకి రావడానికి చాలా సమయం పడుతుంది. దినికి కారణం… చెప్పాల్సిన విషయం ఎక్కువగా ఉండటమే. సాధ్యమైనంత వరకూ క్రిస్ప్ గా చెప్పాలని ప్రయత్నించారు కానీ.. అదీ కాస్త నిదానంగా సాగదీతగానే అనిపిస్తుంది. మొదటి భాగం చూసి ఆ ఆసక్తితో రెండో భాగం చూస్తే ఫర్వాలేదు కానీ తొలి భాగమే చూడకుండా థియేటర్ లో అడుగుపెడితే మాత్రం.. సూత్రం మర్చిపోయిన లెక్కలా దిక్కులు చూడాల్సివస్తుంది. కానీ క్రాఫ్ట్ మీద ఆసక్తి వున్న వారికి, ఈ సినిమా మొదటి భాగాన్ని ఇష్టపడిన వారికి పొన్నియిన్ సెల్వన్ 2 బాగా నచ్చుతుంది.
పొన్నియిన్ సెల్వన్ ప్రత్యేకంగా నిలిపింది తారాగణం. ఒకరికి మించి ఒకరు నటించారు. అన్నీ పాత్రలు ప్రాణం పోసుకున్నాయి. ఆదిత్యగా విక్రమ్ నటన గుర్తుండిపోతుంది. ఐశ్వర్యరాయ్ నటన ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. నందిని పాత్రలో జీవించేసింది. విక్రమ్, ఐశ్వర్యల ముగింపు అంకానికి ప్రత్యేక మార్కులు పడతాయి. పొన్నియిన్ సెల్వన్ పాత్రలో చేసిన జయంరవి నిజంగా రాజులానే ప్రవర్తించాడు. అతని ఆహార్యం చాలా బావుంది. కార్తి పాత్ర రెండో భాగంలో కాస్త తగ్గింది. మొదటి భాగం అంత చలాకీగా కనిపించలేదు. కానీ చివర్లో ఆ పాత్రే కీలకంగా నిలిచింది. త్రిష రాజసం ఒలికించింది. తొలి భాగంతో పోల్చుకుంటే ప్రకాష్ రాజు పాత్ర నిడివి ఇందులో ఎక్కువ. ఐశ్వర్యలక్ష్మి, శోభితా ధూళిపాళ్ల, రెహమాన్, శరత్‌కుమార్, పార్తీబన్, విక్రమ్ ప్రభు, ప్రభు అందరూ పాత్ర మేరకు చేశారు.
సాంకేతికంగా ఉన్నతంగా వుంది పొన్నియిన్ సెల్వన్. రవివర్మన్ కెమెరా పనితనం మరోస్థాయిలో వుంది. చోళ కాలంలో తిరిగింది కెమరా. తోట తరణి సెట్స్ ని చాలా సహజంగా తీర్చిదిద్దారు. ఏఆర్ రెహమాన్ నేపధ్య సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో ఒకొక్క పాత్రకి ఒకొక్క ట్రాక్ చేశారు. నందిని, ఆదిత్యల లవ్ ట్రాక్ మళ్ళీ మళ్ళీ హమ్ చేసుకునేలా వుంటుంది. అలాగే చోళ కిండమ్ ట్రాక్, వందీయదేవన్, కుందవై.. ఇలా ప్రతి పాత్రని మ్యూజికల్ గా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అందులో ఎక్కువ క్లాసికల్ మ్యూజిక్ వినిపిస్తుంది. వీర బాదుడు ఇష్టపడే వారికి మాత్రం.. ఇందులో రెహ్మాన్ చేసింది నేపధ్య సంగీతంలా కూడా అనిపించకపొవచ్చు. ఆగనందే పాట ట్యూన్ చాలా బావుంది. కానీ తెలుగు సాహిత్యం సరిగ్గా కుదరేదు. తెలుగు డబ్బింగ్ లో ప్రత్యేక శ్రద్ధ కనిపించింది. తనికెళ్ళ భరిణి మాటల్ని చక్కగా తెలుగీకరించారు.
వింటేజ్ మణిరత్నం టేకింగ్ చాలా సన్నివేశాల్లో గమనించవచ్చు. ఆదిత్య కండబూర్ కి వచ్చి.. గుర్రం దిగకుండానే మాట్లాడటం, వందియదేవన్, కుందువై చేతిలో కత్తిని లాక్కొని ఆమె చేయి పట్టుకోవడం, సుందర చోళుడు మందాకిని తలుచుకొని మాట్లాడటం, చివర్లో నందిని, ఆదిత్య మాట్లాడుకునే సన్నివేశాలు మణిరత్నం మాస్టర్ టేకింగ్ ఏమిటో మరోసారి చూపిస్తాయి. ముఖ్యంగా ఆయన పాపులర్ క్లోజప్స్ లిస్టులో ఇందులో చాలా సన్నివేశాలు చేరిపోతాయి. మణిరత్నం ఏనాడూ కమర్షియల్ విజయాలు గురించి అలోచించుకోలేదు. తను నమ్మింది నిజాయితీగా తీసుకుంటూ వెళ్ళిపోయారు. పొన్నియిన్ సెల్వన్ అక్షరాలకు తెరపై రూపం ఇవ్వాలని, ఒక చిత్రరూపం వుండాలని ఎప్పటి నుంచో కలలుగన్న మణిరత్నం.. ఈ రెండు భాగాలతో అది నెరవేర్చుకున్నారనే చెప్పాలి.