శాసనమండలి తీసుకున్న నిర్ణయాన్ని కూడా సవాల్ చేసి.. ఏకంగా శాసనమండలి చైర్మనే తప్పు చేశారంటూ వాదించి ప్రభుత్వం తరపున వ్యవస్థను సైతం దిగజార్చిన … ఘనత కార్యదర్శి బాలకృష్ణమాచార్యులది. అమరావతి బిల్లుల విషయంలో శాసన మండలి సెలక్ట్ కమిటీకి పంపింది. మెజార్టీ ఎమ్మెల్సీలు మద్దతు పలికారు. అయినప్పటికీ మండలి నిర్ణయాన్ని అసెంబ్లీ కార్యదర్శి ధిక్కరించారు. చైర్మన్ తప్పు చేశారని ఎదురు లేఖలు రాశారు. శాసనమండలి అధికారాలనే ప్రశ్నించారు. ఇదంతా ప్రభుత్వ మెప్పు కోసం చేశారు. ఇప్పుడు అయన అత్యంత అవమానకరంగా రిటైరయ్యారు.ఈ అవమానం బయట నుంచి కాదు జగన్ దగ్గరనుంచే వచ్చింది.
బాలకృష్ణమాచార్యులు పదవి కాలం ఈ నెల 30వ తేదీ వరకూ ఉంది. కానీ పది రోజుల కిందటే ఆయన అధికారిక ఫోన్ నెంబర్ నుంచి సర్వీస్ నిలిపివేశారు. తన ఫోన్ పని చేయడం లేదు ఏమిటా అని ఆరా తీస్తే ఆయనకు విషయం తెలిసింది. తాను ఊడిగం చేసినందుకు పదవి కాలం పొడిగింపు ఇస్తారనుకుంటే… ఇలా అవమానిస్తున్నారేమిటా అని ఆయన మనసులో బాధపడిపోయారు. అయినా పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు చేయగలిగినదంతా చేశారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. దాంతో ఆయన శుక్రవారం రిటైరయ్యారు. కనీసం వీడ్కోలు సభ కూడా ఎవరూ పెట్టలేదు.
వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వానికి అండగా ఉన్న అధికారులు ఈ ప్రభుత్వంలో చాలా మంది ఉన్నారు. వారందరికీ రిటర్న్ గిఫ్టులుగా ఇలాంటి పరిణామాలే వస్తున్నాయి. అయితే వారి బారిన పడిన బాధితులు .. వీరిని ఇబ్బంది పెడితే ఓ కారణం ఉందని అనుకునేవారు. కానీ వీరితో అలాంటి పనులు చేయించిన ప్రభుత్వ పెద్దలే అవమానిస్తూండటం ఇక్కడ కీలకం. ఎల్వీ సుబ్రహ్మణ్యం నుంచి బాలకృష్ణమాచార్యుల వరకూ అదే జరిగింది. ఇక లైనులో ఎంత మంది ఉన్నారో ?