బీఆర్ఎస్ వద్ద లెక్కలేనంత అధికారిక ధనం ఉంది. బ్యాంకుల్లోనే పన్నెండు వందల కోట్లకుపైగా ఉన్నాయని నెలకు ఏడు కోట్లకు పైగా వడ్డీ వస్తుందని కేసీఆర్ చెబుతున్నారు. నిజానికి పార్టీ కార్యక్రమాలకు పార్టీ ఖాతా నుంచి డబ్బులు చెల్లించరు. పార్టీ నేతలే ఖర్చులు పెట్టుకుంటూ ఉంటారు. అధికార పార్టీ అయితే చెప్పాల్సిన పని లేదు. పార్టీ ఖాతా నుంచి చెల్లించే ఖర్చు చాలా తక్కువ. ఈ అడ్వాంటేజ్ తో ఇప్పటికే కేసీఆర్ పార్టీని ఆర్థికంగా బలపరిచారు. ఇప్పుడు ఏకంగా జాతీయ మీడియా వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు.
ప్లీనరీ సమావేశంలో పార్టీకోసం చానల్ పెడతామని కేసీఆర్ ప్రకటించారు. టీ చానల్ ఉంది కదా అని చాలా మంది ఎమ్మెల్యేలకు డౌట్ వచ్చింది. పైగా అది తెలంగాణ భవన్ లోనే ఉంటుంది. కానీ కేసీఆర్ పెట్టాలనుకుంటున్నది జాతీయ మీడియా నెట్ వర్క్ అని.. సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న చానల్ కొనడమా లేకపోతే… సొంతంగా ఏర్పాటు చేయడమా అన్నది పరిశీలిస్తున్నారని అంటున్నారు. మీడియా చానల్ పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. అఫీషియల్ మనీని అంత పెద్ద మొత్తంలో సమకూర్చుకోవడం కష్టం. నమస్తే తెలంగాణ, టీ చానల్ లాగా.. పెట్టించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. అందుకే పార్టీ ఓనర్ షిప్‌లోనే మీడియా చానల్ పెట్టాలని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది .
జాతీయ మీడియాలో ప్రచారం కోసంకేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు. ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా కూడా ఆయన ఈ నిధులు వెచ్చిస్తున్నారు. అయితే దానికి తగ్గ ప్రయోజనాన్ని.. ప్రచారాన్ని పొందుతున్నామని ఆయన అనుకోలేకపోతున్నారు. సొంత మీడియా ఉంటేనే జాతీయ రాజకీయాల్లో రాణిస్తామని భావిస్తున్నారు. అందుకే ముందడుగు వేస్తున్నారని చెబుతున్నారు.