అల్లుడు అదుర్స్ తరవాత… బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ఏం రాలేదు. ఆయన దాదాపుగా రెండేళ్లుగా ఛత్రపతి ప్రాజెక్టుతోనే ఉన్నాడు. పాన్ ఇండియా క్రేజ్ మహా జోరుగా ఉన్నప్పుడు మొదలైన సినిమా అది. ఇప్పుడు పాన్ ఇండియా మబ్బులన్నీ తొలగిపోతున్నాయి. అందుకే ఈ సినిమాని హిందీకే పరిమితం చేయాలని చిత్రబృందం ఫిక్స్ అయ్యింది. అంటే.. ఛత్రపతి గా బెల్లంకొండ హంగామాని తెలుగు ప్రేక్షకులు చూసే వీల్లేదన్నమాట.
నిజానికి బెల్లంకొండ – వినాయక్ కాంబో అంటే తెలుగు ప్రేక్షకులకు కాస్తో కూస్తో గురి ఉంటుంది. దానికి తోడు… ఇది ఛత్రపతి రీమేక్. ప్రభాస్ చేసిన పాత్రని బెల్లంకొండ ఎలా చేశాడన్న క్యూరియాసిటీ ఉంటుంది. కథలో మార్పులు, చేర్పులూ ఏమైనా చేశారా చూద్దాం అనే ఆశ కూడా ఉంటుంది. అయినా సరే.. ఈ సినిమాని తెలుగులో విడుదల చేయకూడదని చిత్రబృందం ఫిక్సవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దాన్ని బట్టి చూస్తుంటే, తెలుగు కథకూ, హిందీ కథకూ ఏమాత్రం మార్పుల్లేవన్న విషయం రూఢీ అవుతుంది. కాపీ పేస్ట్ సినిమాని తెలుగులో ఎందుకు చూడాలి? ఎవరు చూడాలి?
ఛత్రపతి హిందీ డబ్బింగ్ సినిమాని ఇప్పటికే బాలీవుడ్ జనాలు చూసేశారు. హిందీ ఛానళ్లలో ఈ డబ్బింగ్ సినిమా.. ఇప్పటికి వంద సార్లయినా ప్రసారం అయి ఉంటుంది. అయినా సరే – హిందీలో రీమేక్ చేసి, వదులుతున్నారంటే, అందునా.. కేవలం హిందీ మార్కెట్ నే టార్గెట్ చేశారంటే.. ఇది అన్నింటికంటే పెద్ద ఆశ్చర్యం.