వైఎస్సార్ సిపి ఎంఎల్ఎలు బహిరంగంగా చెబుతున్న మాట ఇది. అనూహ్యమైన విధంగా తెలుగుదేశం తమ వారిని తీసుకుపోతుంటే నిలవరించలేని నిస్సహాయత. తమ నాయకుడికి వ్యూహం మార్చుకోవాలని చెప్పినా వినరనే నిర్లిప్తత. చాలామంది వైసీపీ నేతలలో కనిపిస్తున్నాయి. టిడిపి ఫిరాయింపు రాజకీయాలను గట్టిగా ఖండిస్తున్నా పార్టీ వారిని నిలబెట్టుకోలేకపోతున్న అధినేత జగన్ వైఖరి కూడా అనివార్యంగా ప్రశ్నార్థకమవుతున్నది. ఇప్పటికే ఎనిమిదికి చేరిన ఫిరాయింపుల సంఖ్య కనీసం 15-20 వరకూ చేరవచ్చనే అంచనా వారికే వుంది. తమతో మాట్లాడుతున్న వారి పేర్లు కూడా టిడిపి నేతలు దాచిపెట్టడం లేదు. చేతనైతే ఆపుకోండి అంటున్నారు. కాని వారే ఆగేలా కనిపించడం లేదు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు అధికార పక్షం ఆహ్వానిస్తున్నప్పుడే అటు దూకడం మంచిదని తొందరపడుతున్నారు. జగన్ ప్రతినిధులుగా వారితో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఫలితం వుండటం లేదు. అధికారం లేకుండా బతకలేని అవకాశవాదంతో పాటు అధికార పక్షం అష్టదిగ్బంధం కూడా వారి చేరికకు కారణమవుతున్నది. రాజ్యసభలో వైసీపీకి స్థానం లేకుండా చేయాలనే ఆశ వున్నా ఈ సారికి అది సాధ్యం కాదనే వాస్తవిక అంచనా కూడా టిడిపికి వుంది. ఇక ముందు మాత్రం వారికి రాజ్యసభకు పంపే అవకాశం వుండబోదని చెబుతున్నారు. శాసనసభలో రాష్ట్ర సమస్యలపైనా కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో వైఫల్యంపైనా చర్చ జరగకుండా చేసేందుకు ఇది కూడా ఒక అస్త్రం అవుతుంది. వైసీపీ ఫిరాయింపులపై నిరసన తెల్పడమే వివాదాస్పదం చేస్తారు. వారు కూడా ముందు ఈ సమస్యపై కేంద్రీకరించాల్సిన పరిస్థితి తీసుకొస్తారు. బిజెపిని కొద్దిగానూ టిడిపిని ప్రధానంగానూ విమర్శించే వైసీపీ వైఖరి కూడా పెద్దగా ఆమోదం పొందడం లేదు. సిబిఐ భయం కేంద్రంపై తీవ్ర విమర్శలు చేయడానికి అడ్డంకి అవుతున్నది. కేంద్రాన్ని అనకుండా కేవలం చంద్రబాబునే విమర్శించడం టిడిపి ఎదురుదాడికి దారితీస్తున్నది. వీరంతా బయిటకు వెళ్లినా మాకేమీ ఫర్వాలేదన్నట్టు జగన్ మాట్లాడుతున్నా ఈ పరిణామాల ప్రభావం ఆ పార్టీ నాయకులపై పడుతున్నది. ఏం చేయాలో తోచడం లేదనీ, తమ నాయకుడు చెబితే వినే మనిషి కాదని వారు చెబుతున్నారు. తమ సమావేశాలు కూడా ఫిరాయింపుల గురించి మాట్టాడేందుకు కాదని నమ్మించేందుకు తంటాలు పడుతున్నారు.కాని వారికే ఆ నమ్మకం వుండటం లేదు. ఈ ఘట్టంలో తెలుగుదేశం తమపై రాజకీయంగా పైచేయి సాధించందని వారు అంగీకరించక తప్పడం లేదు. అయితే కేంద్రం సహాయ నిరాకరణ, ప్రజలలో అసంతృప్తి కారణంగా త్వరలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని అప్పుడు మళ్లీ తామే ముందుంటామని కొందరు భరోసా వ్యక్తం చేస్తున్నారు. శాసనసభ సమావేశాలలో గాని రాజకీయ పరిణామాలు ఒక కొలిక్కి రావు.