తెలంగాణ ఏర్పడిన 9 ఏళ్ల తర్వాత స్వయం పాలనకు సరికొత్త అడ్రస్ సిద్ధమయింది. ఉమ్మడి రాష్ట్ర గుర్తులు ఉండకూడదన్న లక్ష్యమో.. నిజంగానే తెలంగాణకు తలమానికంగా ఉండాలన్న ఉద్దేశమో కానీ కేసీఆర్ పదవి చేపట్టినప్పటి నుండి కొత్త సచివాలయం నిర్మాణం కోసం కలలు కన్నారు. మొదట బైసన్ పోలో గ్రౌండ్ అనుకున్నారు. కానీ అది రక్షణశాఖది. కేంద్రం ఇవ్వలేదు. తర్వాత ఎర్రగడ్డ ఆస్పత్రి స్థలం అనుకున్నారు. కానీ కుదరలేదు. చివరికి ఏపీలో ప్రభుత్వం మారడంతో జగన్ సీఎం కాక ముందే ఏపీకి కేటాయించిన భవనాలన్నీ ఇచ్చేశారు. వెంటనే వాటిని పడగొట్టి.. విశాలమైన స్థలం చేసుకుని కొత్త సచివాలయ భవనాల్ని నిర్మించారు.
నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్ 2019 జూన్ 27న కొత్త సచివాలయం భవన నిర్మాణానికి భూమిపూజ, శంకుస్థాపన చేశారు. సచివాలయ నిర్మాణానికి డాక్టర్ ఆస్కార్, పొన్ని కాన్సెస్సావో అనే ప్రఖ్యాత ఆర్కిటెక్టులు డిజైనర్లుగా వ్యవహరించారు. సీఎం కేసీఆర్ ఆమోదించిన ప్రస్తుత నమూనాతో నూతన సచివాలయం రూపుదిద్దుకున్నది. షాపూర్ జీ పల్లోంజి అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సచివాలయన్ని నిర్మించే కాంట్రాక్టును దక్కించుకొని అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టింది. నిజామాబాదులోని కాకతీయుల కాలంనాటి నీలకంఠేశ్వరస్వామి దేవాలయం, వనపర్తి సంస్థానపు రాజప్రాసాదాల్లోని శైలులు-అక్కడి గోపురాలు, గుజరాత్ లోని సారంగాపూర్ హనుమాన్ దేవాలయ శైలుల ఆధారంగానే సచివాలయం గుమ్మటాల నిర్మాణాలు జరిగాయి.
బయటివైపు ఆకర్షణీయంగా కనిపించే తాపడాలన్నింటినీ ఎర్ర ఇసుకరాతితోనూ, మధ్యనున్న శిఖరం లాంటి బురుజును రాజస్థాన్ లోని ధోల్పూర్ నుంచి తెచ్చిన ఇసుకరాతితో నిర్మించారు. నూతన సచివాలయానికి తూర్పున లుంబినీవనం, అమరజ్యోతి.. పశ్చిమాన మింట్ కాంపాండ్, ఉత్తరాన అంబేద్కర్ విగ్రహం, దక్షిణాన రవీంద్రభారతి రోడ్డు ఉన్నాయి. . 28 ఎకరాల్లో 2.5 ఎకరాల్లో మాత్రమే భవనాన్ని నిర్మించారు. పార్కింగ్ ను 6 ఎకరాల్లో చేసేలా తగిన విధంగా ఏర్పాట్లు చేశారు. 2వేల మంది ఉద్యోగులు పనిచేసే విధంగా నూతన సచివాలయాన్ని నిర్మించారు. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్లో స్టోర్స్, రికార్డ్ రూంలు, వివిధ సేవలకు కేటాయించారు.
విదేశీ ప్రతినిధులు, ఇతర అతి ముఖ్యమైన వ్యక్తులు వచ్చినప్పుడు హై టీ, రాయల్ డిన్నర్లలకు డైనింగ్ హాలుని వినియోగిస్తారు. మొత్తంగా ఇక నుంచి తెలంగాణ పరిపాలనకు కొత్త అడ్రస్ దొరికినట్లయింది. మరి కేసీఆర్ కొత్త సచివాలయానికైనా రోజూ వస్తారా.. లేదా అన్నది ఎక్కువ మందికి ఉన్న సందేహం. ఎందుకంటే ఆయన సీఎం పదవి చేపట్టిన తర్వాత సచివాలయానికి వచ్చి పని చేసిందే లేదు మరి !