ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన కనీస బాధ్యతను మర్చిపోయింది. ప్రజల్ని గాలికి వదిలేసింది. ప్రకృతి పరంగా ఏం జరిగితే తాము ఎలా బాధ్యత వహిస్తామని నేరుగానే చెప్పుకుంటోంది. ఓ వైపు రైతులు అకాల వర్షాలతో సర్వం కోల్పోగా ప్రభుత్వం మాత్రం బిందాస్‌గా రాజకీయ కుట్రలు చేసుకుంటోంది. ఎప్పుడు ఎవర్ని తిట్టాలి.. ఎవర్ని అక్రమ కేసుల్లో జైల్లో పెట్టాలి.. తమ వాళ్లు జైలుకు వెళ్లకుండా ఎలాంటి లాబీయింగ్ చేసుకోవాలన్న అంశాలపైనే ప్రభుత్వ పెద్దలు సమయం కేటాయిస్తున్నారు. దీంతో రైతులు అల్లాడిపోతున్నారు.
అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు
గత కొద్ది రోజులుగా ఏపీలో అకాల వర్షాలు పడుతున్నాయి. ఇది వర్షాకాలం కాదు. ఎండా కాలం. చేతికొచ్చేపంటలు పూర్తి స్థాయిలో ధ్వంసం అయ్యాయి. కళ్లాల్లో ఆరబెట్టుకున్న మిర్చి లాంటివి తడిచిపోయాయి. ధాన్యం లాంటి వాటి గురించి చెప్పాల్సిన పని లేదు. ఇది ఓ విపత్తు లాంటిది. కానీ రైతుల్ని పరామర్శించేవారే వారు. ఆదుకుంటామని భరోసా ఇచ్చేవారే లేరు. కనీసం వాతావరణ హెచ్చరికలపై ముందస్తు సూచనలు చేసి..రైతులకు కనీసం పట్టాల్లాంటివి పంపిణీ చేసే ఆలోచన కూడా చేయలేదు. ఏ ప్రభుత్వమూ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని.. ఏడాదికి రూ. ఏడు వేలు ఇచ్చి… నట్టేట ముంచేశారని వారు మథనపడుతున్నారు.
తుపానులు ఆపలేమన్న వ్యవసాయ మంత్రి – సాయం చేయకుండా ఎవరు అడ్డుకున్నారు ?
తుపానులు ఆపే శక్తి లేదని.. సముద్రంలో జరిగే వాటిని నియంత్రించలేమని వ్యవాసాయ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి కబుర్లు చెబుతున్నారు. అయితే మందస్తు జాగ్రత్తలు తీసుకోవడం.. నష్టపోయిన వారికి సాయం అందించకుండా ఎవరు అడ్డుకున్నారన్న ప్రశ్నలువస్తున్నాయి. గత నాలుగేళ్ల కాలంలో ఎన్నో విపత్తులు రైతుల్ని అతలాకుతలం చేశాయి. కానీ ఒక్క సారంటే ఒక్క సారీ పరిహారం ఇవ్వలేదు. సీఎం సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాం కూలిపోతేనే పరిహారం ఇవ్వలేకపోయారు. వారిని రోడ్డున పడేశారు. ఇప్పుడు పరిహారం అంచనా వేస్తున్నామని అదనీ.. ఇదనీ చెబుతున్నారు. కానీ పరిహారం ఇస్తామని మాత్రం చెప్పడం లేదు.
నాలుగేళ్లలో చితికిపోయిన రైతులు !
రైతులు బాగుండాలంటే.. ముందుగా ప్రభుత్వ వ్యవస్థలన్నీ సక్రమంగా పని చేయాలి. కానీ ఈ నాలుగేళ్లలో నీళ్ల దగ్గర్నుంచి పంట అమ్ముకునేవరకూ ఏ దశలోనూ ప్రభుత్వ వ్యవహారాలు రైతలకు అనుకూలంగాలేవు. నిర్ణయాలన్నీ గడువు తీరిన తర్వాత తీసుకున్నారు. మద్దతు ధర స్థిరీకరణ నిధి పెట్టలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే తాము రైతు భరోసా కింద రూ. ఏడున్నర వేలు ఇస్తున్నాం కాబట్టి ఇంకేమీ చేయమని.. అదే రైతుల్ని లక్షాధికారుల్ని చేయడం అన్నట్లుగా వ్యవహరి్సతున్నారు. ఫలితంగా రైతాంగం .. సంక్షోభంలో కూరుకుపోయింది.