ఉచితాలపై ప్రధాని మోదీ సూక్తులు చెబుతూ వస్తున్నారు. ఉచితాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమని కూడా బాధపడ్డారు. అయితే ఈ ఉచితాలు తాము ఇస్తే మాత్రం మంచివే అన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోంది. తాజాగా సర్వేలన్నింటిలో వెనుకబడిపోయి.. దింపుడు కళ్లెం ఆశల్లా.. హిజాబ్‌లు..హలాల్లు నమ్ముకున్న బీజేపీ ఇప్పుడు… ఉచిత్ హామీల వరద పారించింది. ప్రధాన మోదీ కర్ణాటకలో గల్లీ గల్లీలో ప్రచారం చేస్తున్న సమయంలోనే బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అందులో అన్నీ ఉచితాలే.
రోజూ అరలీటర్ నందినీ పాలు కూడా ఉచితంగా ఇస్తారట. అసలు నందినినీ అమూల్ పరం చేయడానికి వేసిన ప్లాన్ అడ్డం తిరగడంతో ఈ రకంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కొన్ని జనాకర్షక పథకాలను ప్రకటిస్తోంది. వాటిని మించి ఇప్పుడు బీజేపీ ఉచితాలను ఇస్తోంది. విచిత్రంగా ఈ సారి రేషన్ బియ్యం కాకుండా.. సిరిధాన్యాలను ఇస్తామని చెబుతోంది. బీజేపీ మేనిఫెస్టో చూసిన వారికి కళ్లు బైర్లు కమ్ముతాయి. ఉచితాల గురించి మోదీ చెప్పే మాటలు ఏమైపోాయయన్న వాదన గుర్తుకొస్తుంది.
కర్ణాటకలో బీజేపీకి పూర్తి స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్యమంత్రుల మార్పు వర్కవుట్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. కులం మతంతో ఎంత రాజకీయం చేసినా చివరికి గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. గతంలో తమకు ప్రజలు అధికారం ఇవ్వకపోయినా ఇతరుల అధికారం లాక్కున్న బీజేపీకి ఈ సారి భారీ దెబ్బ తగలడం ఖాయం అన్న భావన రావడంతో అసాధ్యమైన హామీలు…తాము వ్యతిరేకమంటున్న ఉచితాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.