మహారాష్ట్రలో సునామీ సృష్టించబోతున్నామని ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్కు అక్కడ ఎలాంటి గాలి లేదని తెలియడానికి ఎక్కువ కాలం పట్టలేదు. అట్టడుగు స్థాయి నుంచే బలోపేతం అయ్యామని చెప్పుకునేందుకు మొదట బోకర్ తాలూకా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులతో పోటీ చేయించారు. ఈ పోటీ ఆషామాషీగా జరగలేదు. బోకర్ మార్కెట్ యార్డుపై పట్టున్న ఓ మాజీ ఎమ్మెల్యేకు భారీ ఆఫర్ ఇచ్చి మరీ బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఆయనే మద్దతు దారులను నిలబెట్టారు.
బోకర్ మండలం నాందెడ్ పరిధిలోకి వస్తుంది. అక్కడ కేసీఆర్ బహిరంగసభ కూడా నిర్వహించారు. కొంత మంది సర్పంచ్లను పార్టీలో చేర్చుకున్నారు. ఆదిలాబాద్ మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రయటించారు. మార్కెట్ కమిటీ ఎన్నికల్లో గెలిచి సంచలనం సృష్టించాలనుకున్నారు. తీరా ఎన్నికల్లో మార్కెట్ కమిటీపై పట్టు ఉన్న మాజీ ఎమ్మెల్యేను కూడా రైతులు పట్టించుకోలేదు. మొత్తం 18 డైరెక్టర్ పోస్టుల్లో ఒక్కటి కూడా బీఆర్ఎస్కు దక్కలేదు. కాంగ్రెస్ మద్దతుదారులు 15 మంది, బీజేపీ మద్దతుదారులు ముగ్గురు గెలుపొందారు.
మహారాష్ట్రలో పార్టీని విస్తరించేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. మన రాష్ట్రానికి సరిహద్దు ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రెండు మూడు చోట్ల బహిరంగ సభలు కూడా పెట్టారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించారు. కానీ మార్కెట్ కమిటీ ఎన్నికలు ఇచ్చిన దెబ్బతో బీఆర్ఎస్ మొదటి ప్రయత్నం విఫలమయింది. ఓ బలమైన రాజకీయ నాయకుడ్ని చేర్చుకుని కూడా ఈ పరిస్థితి రావడంతో బీఆర్ఎస్ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. స్థానిక ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితి వస్తే.. ఇక వచ్చే ఎన్నికల దాకా అవసరం లేదని..అప్పుడే బీఆర్ఎస్ బుడగ పేలిపోతుందని సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి.