గవర్నర్ విషయంలో ప్రోటోకాల్ పాటించకుండా తెలంగాణ సర్కార్ ఇబ్బంది పెడుతోందనే విమర్శలు చాలా రోజులుగా ఉన్నాయి. అసలు ప్రోటోకాల్ ఇవ్వకపోగా.. ఆమె తెలంగాణను అవమానిస్తోందంటూ విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. తాజాగా మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి అలాంటి విమర్శలు చేసి.. ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేశారు. తెలంగాణ సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి గవర్నర్ హాజరు కాలేదు. ఆ విషయం ఎవరూ పట్టించుకోలేదు. ఇతర పార్టీల నేతలకు ఆహ్వానం పంపారు కానీ తాము వెళ్లడం లేదని బండి సంజయ్, రేవంత్ రెడ్డి వంటి వారు ప్రకటించారు. వారు రాకపోయినా ఎవరూ పట్టించుకోలేదు.
కానీ.. గవర్నర్ రాలేదంటూ తమిళిసై సౌందరరాజన్ పై మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గవర్నర్ సచివాలయం ప్రారంభోత్సవానికి రావడం, రాకపోవడం అనేది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని పెద్ద పెద్ద మాటలన్నారు. గవర్నర్ నిజస్వరూపం బయటపడిందని.. తెలంగాణ అభివృద్దిని చూసి కొంతమంది తట్టుకోలేకపోతున్నారని నిందించారు. అయితే ఈ అంశంపై రాజ్ భవన్ స్పందించింది. నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి గవర్నర్‌కు ఆహ్వానం అందలేదని రాజ్‌భవన్ స్పష్టం చేసింది.
గవర్నర్‌కు అసలు ఆహ్వానం ఇవ్వలేదని రాజ్ భవన్ అధికారికంగా నోట్ విడుదల చేసింది. ఆహ్వానం రాకే గవర్నర్ సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్లలేదని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. రాజ్ భవన్ ప్రకటనపై ఇంకా మంత్రి జగదీష్ రెడ్డి కానీ.. ప్రభుత్వం కానీ స్పందించలేదు. ఆహ్వానం పంపి ఉంటే ఆ విషయాన్ని ప్రభుత్వం ప్రకటించేది. ఆహ్వానం ఎలా పంపామో చెప్పేది. కానీ అలాంటి ప్రయత్నాలు చేయలేదు. సైలెంట్ గా ఉండిపోయింది. దీంతో గవర్నర్ కు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం పంపకపోగా.,. రాలేదంటూ. నిందించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ అంశాన్ని గవర్నర్ వదిలి పెట్టరని అంటున్నారు.