బీజేపీ తమ తో పాటు కలవాలని జనసేన, టీడీపీ కూడా కోరుకోవడం లేదు. ఆ పార్టీకి తాము సానుకూలం అన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు కానీ పొత్తులు పెట్టుకోవాలనుకోవడం లేదు. కేంద్రంలో మద్దతుగా ఉంటామని ఏపీలో మాత్రం వైసీపీకి సహకరించవద్దని వారి అరాచకాల్ని ఖండించాలని … కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంచేందుకు కలిసి రావాలని బిజెపి కూడా పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కానీ కలసి రావడం కన్నా.. వైసీపీకి సహకరించకపోవడం అన్నదే పవన్ ప్రధానంగా ప్రస్తావిస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీ బీజేపీ నేతలు మాత్రం ఇప్పటికే రెండు రకాలుగా విడిపోయారు. ఓ వర్గం అసలు టీడీపీతో వెళ్లే ప్రశ్నే లేదని.. కుటుంబ, అవినీతి పార్టీలకు వ్యితరేకమంటోంది. జనసేనతో మాత్రమే కలిసి పోటీ చేస్తామని చెబుతోంది. అయితే మరో వర్గం మాత్రం టీడీపీతో పొత్తులుంటాయని బలంగా వాదిస్తోంది. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. కానీ ఆయనపై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసిందని.. పొత్తుల గురించి ఎవరు మాట్లాడమన్నారని ప్రశ్నించారని బీజేపీ వర్గాలే లీక్ చేస్తున్నాయి.
బీజేపీకి ఏపీలో పెద్దగా బలం లేదు. ఒక్క శాతం ఓట్లు మాత్రమే వస్తున్నాయి. కలిసి వచ్చే ఓట్ల పరంగా చూసుకోవాలంటే బీజేపీతో కూటమి కట్టడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ బీజేపీతో పొత్తు వల్ల ఎన్నికలు సక్రమంగా జరగడంతో పాటు ఏపీలో అరాచకాలను తగ్గించవచ్చని అనుకుంటున్నారు. అందుకే సహకారం కోరుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తే.. ఆ పార్టీ కలిసి వస్తే జనసేనతో లేకపోతే ఒంటరిగా పోటీ చేసే చాన్స్ ఉంది. ఒక వేళ కర్ణాటకలో ఫలితాలు వ్యతిరేకంగా వస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ఏపీలో రాజకీయ వ్యూహాలను బీజేపీ మార్చుకునే చాన్స్ ఉంది.