భోగాపురం ఎయిర్ పోర్టుకు సీఎం జగన్ మరోసారి శంకుస్థాపన చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పనులు చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి .. టెండర్లు రద్దు చేసి.. మళ్లీ అవే టెండర్లను చంద్రబాబు టైంలో దక్కించుకున్న జీఎంఆర్కు రివర్స్ టెండర్లు వేసి ఐదు వందల ఎకరాలు తగ్గించి ఇచ్చారు.కానీ అనుమతులు మాత్రం సాధించలేకపోయారు. ప్రధానితో శంకుస్థాపన చేయిస్తామని చాలా సార్లు గప్పాలు కొట్టారు కానీ ..ఇప్పుడు సీఎం జగన్ ఒక్కరే శంకుస్థాపన చేస్తున్నారు. ఒక్క కేంద్ర మంత్రి కూడా రావడం లేదు. కనీసం కేంద్ర విమానయానశాఖ మంత్రితో అయినా శంకుస్థాపన చేయిస్తే కేంద్రం అండ ఉందన్న భావన ప్రజలకు ఉండేది.
ఎయిర్ పోర్టు కు సంబంధించిన అనుమతుల ప్రక్రియపై ప్రభుత్వం గోప్యత పాటిస్తోంది. ఐదు వందలఎకరాలు తగ్గించడం.. ఎయిర్ పోర్టు ప్లాన్ ను మార్చడం వల్ల మళ్లీ కేంద్రం అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. అయితే అన్ని రకాల అనుమతులు వచ్చాయా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. జీఎంఆర్కే మళ్లీ కాంట్రాక్ట్ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా.. ఇంత వరకూ ప్రారంభించకపోవడానిక అనుమతులతో పాటు భూముల సమస్య కూడా ఉంది. చంద్రబాబు హయాంలో ఎయిర్ పోర్టు కోసం భూ సేకరణ జరిపినప్పుడు పరిహారం చాలదని చాలా మందిని రెచ్చగొట్టికోర్టుకు పంపారు. వారికి ఇంకా పరిహారం చెల్లించలేదు. కొన్ని కేసులు కోర్టుల్లో ఉన్నాయి.
సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇటీవల ప్రతి పదిహేను రోజులకో శంకుస్థాపన చేస్తున్నారు. కానీ ఒక్క దానికి రూపాయి కూడా బడ్జెట్ లేదు. మెడికల్ కాలేజీల నిర్మాణాలు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నాయి. పద్దెనిమిది కాలేజీలు కట్టేస్తున్నామని ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరును కూడా మార్చేసుకున్నారు. కానీ ఒక్కటీ నిర్మాణం కాలేదు. కనీసం పునాదులు దాటడం లేదు. రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి పని జరగడం లేదు. పోర్టులు.. ఎయిర్ పోర్టులు.. రోడ్లు అన్నీ మూలన పడి ఉన్నాయి.కానీ శంకుస్థాపనలు మాత్రం ఎన్నికలకు ముందు జోరుగా చేస్తున్నారు. ఫుల్ పేజీ ప్రకటలు ఇస్తున్నారు. రూ. కోట్లకు కోట్లు… సొంత మీడియాకు తరలించుకుంటున్నారు. ఆ ప్రకటనల మొత్తం అయినా పనులు చేస్తున్నారా అన్నది డౌట్.