అంబటి రాంబాబు వ్యవహారం వైసీపీలో చర్చనీయాంశమవుతోంది. ఒక్క కాపు ఓటు కూడా వైసీపీకి రాకుండా ఆయన కుట్ర చేస్తున్నారన్న అనుమానాలు ఆయనపై వ్యక్తమవుతున్నాయి. కాపులపై అనుచిత వ్యాఖ్యలు తరచూ చేస్తూండటమే దీనికి కారణం. ఆయన రాజకీయమో లేకపోతే.. జగన్మోహన్ రెడ్డి వద్ద బానిసత్వం కోసం కాపులను దారుణంగా అవమానిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఆయన ఎక్కడ మాట్లాడినా కాపు కులం గురించే మాట్లాడుతున్నారు. వారు పవన్ వెంట వెళ్తున్నారని కానీ పవన్ సీఎం కారని.. చంద్రబాబు అవుతారని.. కాపులందర్నీ పవన్ అమ్మేస్తున్నారని ఆయన అంటున్నారు. అంబటి వ్యాఖ్యల ఉద్దేశం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాపులు జనసేనకు ఓట్లేసినా పవన్ సీఎం కారని చెప్పడం ఉద్దేశం. అందుకోసం దారుణమైన పదజాలాన్ని వాడుతున్నారు. కాపులు అమ్ముడుపోతారన్నట్లుగా మాట్లాడుతున్నారు.
కాపుల్ని చితికిపోయేలా చేసిన జగన్ సర్కార్ – పట్టించుకోని అంబటి !
సీఎం జగన్ కాపులకు ఘోరమైన అన్యాయం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లు తొలగించారు. కాపు కమ్యూనిటీకి అరకొరగా ఇచ్చే పథకాలు తప్ప ఇంకేమీ ఇవ్వడంలేదు. ఉపాధి హమీ పథకాలు లేకపోవడంతో కాపులు ఆర్థికంగా దిగజారిపోతున్నారు. విద్య, వైద్య, ఉపాధి సౌకర్యాల్లో వారి ప్రమాణాలు పడిపోయాయి. ఇవన్నీ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయినా కాపులపై పగబట్టినట్లుగా అంబటి రాంబాబు వ్యవహరిస్తున్నారు.
జుట్టుకు రంగేసుకునే స్వేచ్చ కూడా లేని మంత్రి పదవి – అయినా అదే బానిసత్వం !
అంబటి రాంబాబుకు వైసీపీలో కనీసం జుట్టుకు రంగేసుకునే స్వేచ్చ కూడా లేదనేది బహిరంగరహస్యం. మంత్రి పదవి ఇచ్చిన కొత్తలో అంబటి రాంబాబు హెయిర్ డై వేసుకుని వెళ్తే జగన్ చిరాకు పడ్డారని… పదవిలో ఉండాలంటే మరోసారి జుట్టుకు రంగేసుకోవద్దని హెచ్చరించారని చెబుతారు. అందుకే అంబటి రాంబాబు జుట్టుకు రంగేసుకోవడం మానేశారు. తన వ్యక్తిగత ఇష్టం ప్రకారం జుట్టుకు రంగేసుకోలేనంత దీన స్థితిలో ఉన్న రాంబాబు.. కాపుల గురించి..బానిసత్వం గురించి అతి మాటలు మాట్లాడుతున్నారు. ఇది వినేవారికి అసహ్యం కలిగిస్తోంది. జగన్ మెప్పు కోసం గతంలో ఓ చానల్ ఇంటర్యూలో కాపులపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఆయనకు మంత్రి పదవి వచ్చింది.
కాపులు పవన్ వెంటే ఉన్నారని అంగీకరిస్తున్న అంబటి !
ఎలా చూసినా కాపు వర్గం పవన్ వెంట ఉన్నారన్న ఓ నిజాన్ని అంబటి అంగీకరిస్తున్నట్లుగా ఉంది. వారంతా పవన్ వెంట ఉంటున్నారని ఆయన ప్రతీ సారి చెబుతున్నారు. గతంలోలా పవన్ ను అభిమానించినా జగన్ కు ఓటేసే పరిస్థితి లేదని అర్థం అయ్యే.. ఇప్పుడు వారినిరెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. నిజంగా కాపుల గురించి ఆలోచించేవారైతే అంబటి రాంబాబు.. తక్షణం కనీసం జుట్టుకు రంగేసుకునే స్వేచ్చ కోసం అయినా బానిసత్వం వదులుకునేవారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆయన తీరు వల్ల కాపులు వైసీపీకి పూర్తిగా దూరం అవుతున్నారని..ఇది మాస్టర్ ప్లానేమో అన్న అనుమానాలు కూడా కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.