ఏ ముహూర్తాన మొదలెట్టారో కానీ… వీరమల్లు విషయంలో ఓ అడుగు ముందు పడితే, పది అడుగులు వెనక్కి వేయాల్సివస్తోంది. వీరమల్లు సినిమా ఏదో కారణంతో… వాయిదా పడుతోంది. షూటింగ్ జరగడం లేదు. మిగిలిన కథలపై, మిగతా దర్శకులపై పెడుతున్న ఫోకస్ పవన్ ఈ సినిమాపై పెట్టడం లేదు. వీరమల్లుని పక్కన పెట్టి ఓజీ, సాయిధరమ్ తేజ్ సినిమా, ఉస్తాద్.. వీటిని పట్టాలెక్కిస్తున్నాడు పవన్. వీరమల్లుని అస్సలు పట్టించుకోవడం లేదు. పవన్‌కి సంబంధించి మరో 40 రోజుల పని బాకీ ఉంది. పవన్ గట్టిగా ఫోకస్ పెడితే… పూర్తి చేయగలడు కూడా. సంక్రాంతికి ఈ సినిమాని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు క్రిష్. కానీ పవన్ నుంచి ఎలాంటి సహకారం రావడం లేదు.
జూన్‌లో వీరమల్లుకి కాల్షీట్లు ఇస్తానని పవన్ మాటిచ్చాడు. అలాగైతే అందరూ అనుకొంటున్నట్టు ఇది… సంక్రాంతికి వచ్చేస్తుంది. కానీ ఈమధ్య పవన్ మైండ్ సెట్ మారింది. 2024 ఎన్నికల తరవాతే… వీరమల్లుని విడుదల చేయాలనుకొంటున్నాడట. ఈలోగా… ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్ని పూర్తి చేస్తాడట. అంటే… ఇప్పట్లో.. వీరమల్లు మొదలు కానట్టే. రెండేళ్ల క్రితం మొదలెట్టిన సినిమా ఇది. ఇప్పటికే నిర్మాత రత్నం భారీగా ఖర్చు పెట్టాడు. వాటికి వడ్డీలు పెరిగిపోతున్నాయి. 2024 జూన్ లేదా జూలై వరకూ వాటిని భరించాలంటే చాలా కష్టం. కాకపోతే.. పవన్‌ని ఏమీ అనలేక క్రిష్, ఏఎం రత్నం ఇద్దరూ మౌనంగా ఉండిపోతున్నారు.