ఏపీ ప్రభుత్వ పరిపాలకులకు చావు తెలివితేటలకు లోటేం లేదు. ప్రజలకు హవ్వ అని నోటి మీద వేలేసుకుంటారని తెలిసినా తమ ప్రతిభా ప్రదర్శన ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. తాజాగా సీఎం జగన్ అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంటలపై సమీక్ష చేశారు. అధికారులు తాము అంచనాలను సిద్ధం చేశామని.. కొన్ని వేల కోట్ల నష్టం జరిగిందని..ఇన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని నివేదికలిచ్చారు. వెంటనే సీఎం .. అందరికీ పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. ఎవరికీ పరిహారం అందలేదనే మాట రాకూడదని కూడా చెప్పుకొచ్చారు.
సీఎం జగన్ మాట విని అధికారులు మొహాలు చూసుకున్నారు. అసలు ఎకరానికి ఎంత పరిహారం ఇవ్వాలి.. నిధులు ఎక్కడి నుంచి తీుకోవాలి అన్న విషయాలు చెప్పకుండా పరిహారం ఇవ్వాలని అనడం ఏమిటని వారు ఆశ్చర్యపోయారు. పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి రూ. పదివేలు చొప్పున ప్రకటించింది. ఏపీ కూడా కనీసం అంత మొత్తం అయినా ప్రకకటించి.. పరిహారం అందరికీ అందేలా ఆదేశిస్తే ఓ అర్థం ఉండేది. కానీ ఒక్క రూపాయి కూడా ఎకరానికి ఇస్తామని చెప్పకుండా.. ఇంత అని నిర్దేశించకుండా అందరికీ పరిహారం ఇచ్చేయాలని ఆదేశించారు.
ఇదే అసలు ప్రచారం అంటే అని రైతులు కూడా గొల్లుమంటున్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి వైపరీత్యాలు వచ్చినప్పుడు.. ఎకరానికి ఆరు నుంచి పదివేల వరకూ ప్రకటించేవారు. అప్పట్లో సీఎం జగన్ వరద ప్రాంతాల్లో పర్యటించి.. ఆరు నుంచి పదివేలు ఎలా సరిపోతాయని పాతిక వేలు ఇవ్వాలని.. డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే తాము వచ్చినంక ఇస్తామని చెప్పేవారు.. ఆయన ప్రభుత్వం వచ్చింది.. ఆ పాతిక వేలు కాదు కదా ఇప్పుడు వర్షాలొస్తే పావలా కూడా ఇవ్వడం లేదు.