ఏపిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది కనుక ఇక మిగిలిన వైకాపాను కూడా తుడిచిపెట్టేస్తే ఇక వచ్చే ఎన్నికలలో తెదేపాకు తిరుగే ఉండదని చంద్రబాబు భావిస్తున్నట్లున్నారు. అందుకే వచ్చే ఎన్నికలలో మనం ఏకపక్షంగా గెలవాలని పార్టీ నేతలకి హితబోధ చేసినట్లున్నారు. అయితే ఓ 10-15 మంది వైకాపా ఎమ్మెల్యేలను తెదేపాలోకి చేర్చేసుకొన్నంత మాత్రాన్న వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోదని చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసు. వచ్చే ఎన్నికల సమయానికి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను బట్టే పార్టీల విజయావకాశాలు నిర్ణయం అవుతాయి తప్ప ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య వలన కాదు.
ప్రస్తుతం తెదేపా, బీజేపీలు కలిసే సాగుతున్నప్పటికీ వాటి మధ్య అంత సయోధ్య లేదనేది బహిరంగ రహస్యమే. రాష్ట్రంలో బీజేపీ బలపడితే తమకు నష్టమని తెదేపా భయపడుతుంటే, రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చినట్లయితే ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడే స్వంతం చేసేసుకొని రాష్ట్రంలో బీజేపీని ‘ఆరో వేలు’గా మిగుల్చుతాడని బీజేపీ భయపడుటోంది. రాష్ట్రంలో ప్రత్యమ్నాయ రాజకీయ పార్టీగా ఎదగాలని కలలు కంటున్న బీజేపీ, ఒకవేళ వచ్చే ఎన్నికల సమయానికి తెదేపాతో తెగతెంపులు చేసుకోవాలనుకొంటే ఆశ్చర్యం లేదు.
కానీ దానికి రాష్ట్రంలో వ్యతిరేకతే తప్ప స్వతహాగా బలం లేదు. కనుక తెదేపాకు ప్రత్యామ్నాయంగా కనబడుతున్న వైకాపాతో అది చేతులు కలపవలసి ఉంటుంది. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి చాలా రోజులుగా కళ్ళు కాయలు కాసేట్లు ఎదురుచూస్తున్నారు. ఒకవేళ బీజేపీ తెదేపాతో కటీఫ్ చేసుకొని తనతో స్నేహం చేయదలిస్తే ఆయన ఎగిరిగంతేస్తారు. చంద్రబాబు నాయుడితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డితో చేతులు కలపడం వలననే బీజేపీకి ఎక్కువ ప్రయోజనం ఉండవచ్చును. ఆయనయితే రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి సమానంగా వాటా పంచి ఇవ్వవచ్చును. పైగా ఈడి, సిబిఐ కేసులున్నాయి కనుక అతనిని నియంత్రించడం కేంద్రానికి చాలా సులువు. కనుక ఒకవేళ వచ్చే ఎన్నికలలో బీజేపీ వైకాపాతో చేతులు కలపదలిస్తే, అందుకు ఇప్పటి నుండే అతనికి సానుకూలంగా వ్యవహరిస్తూ తెదేపాకు వ్యతిరేకంగా వ్యవహరింస్తోందేమో…బహుశః అందుకే జగన్మోహన్ రెడ్డి కోరినప్పుడుడల్లా ప్రధాని నరేంద్ర మోడి, కేంద్రమంత్రులు అపాయింట్ మెంట్లు ఇస్తున్నారేమో?
ఒకవేళ బీజేపీ ఆయనతో చేతులు కలపడానికి సిద్దపడకపోయినా, ఆయన మాతృసంస్థ కాంగ్రెస్ పార్టీ అందుకు సిద్దంగా ఉంది. కనుక ఇప్పుడు కొంత మంది వైకాపా ఎమ్మెల్యేలని తెదేపా ఎగరేసుకుపోయినా రాష్ట్రంలో వైకాపా లేకుండా తుడిచిపెట్టేయడం తెదేపా వల్ల కాదు. ఇప్పుడు ఏదో కొంతమంది వైకాపా ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకొన్నా దాని వలన ఇప్పటికే చాలా బలంగా ఉన్న పార్టీ ఇంకా బలపడుతుందో లేదో తెలియదు కానీ వారి చేరిక వలన పార్టీలో ముసలం పుట్టడం తధ్యం. వైకాపాను తుడిచిపెట్టేసి రాష్ట్రంలో తమకు వేరే పార్టీ నుండి పోటీ లేకుండా చేసుకోవాలని చంద్రబాబు నాయుడు కూడా అచ్చం కేసీఆర్ లాగే ఆలోచిస్తున్నారు. అయితెహ్ ప్రజాస్వామ్య విరుద్దమైన ఇటువంటి ఆలోచనల వలన తెదేపాలు లాభం చేకూరుతుందనేది కేవలం భ్రమ మాత్రమే.