“రైతు ఐదు వేళ్లు మట్టిలోకి వెళ్తేనే మన ఐదు వేళ్లు నోట్లోకి వెళ్తున్నాయి” ఇది కొటేషన్ మాత్రమే కాదు వాస్తవం కూడా. అది ఒక్క ఆహారం అనుకుంటే అంత కంటే పొరపాటు లేదు. సమస్త ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం మీద రైతు మీద ఆధారపడి ఉంది. ఆ సైకిల్ ఎలా ఉంటుందంటే.. ఓ రైతు పంట పండిస్తాడు. దాన్ని మార్కెట్ యార్డుకు తీసుకు వస్తాడు. మొదట హమాలి దించుతాడు. ఆ తర్వాత కమిషన్ కొట్టు వ్యాపారి అమ్మి పెడతాడు. అతని వద్ద మరో వ్యాపారి కొంటాడు. అతను మరో వ్యాపారికి ఎక్స్ పోర్ట్ చేశాడు. పక్క రాష్ట్రానికో.. పక్క దేశానికో ఎగమితి చేసి లాభం పొందుతాడు. అలా పొందిన వాడు దాన్ని ప్యాకెట్లుగా మార్చి ప్రజలకు అమ్ముతాడు. ఈ క్రమంలో ఎంత మంది లాభపడ్డారో చూడండి.. హమాలీ, కమిషన్ కొట్టు వ్యాపారి, కొనుగోలు వ్యాపారి, ఎక్స్ పోర్టర్, తయారీ దారు.. ఇలా ప్రతీ అంకంలోనూ రైతు పంట సేల్ అయింది. ప్రతీ ఒక్క రికి లాభం మిగిల్చింది. విషాదం ఏమిటంటే.. అందరి కంటే తక్కువ లాభం కలిగేది రైతుకే. కనీస మద్దతు ధర కూడా లభించడం కష్టమే. ఇది నమ్మి తీరాల్సిన నిష్టూరసత్యం. మరి ఇలాంటి రైతులకు ప్రభుత్వం ఎంత చేసినా తక్కువే. కానీ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా ఎందుకు కోవడం లేదు..? కనీసం వారిని పరామర్శించే దిక్కు కూడా ఎందుకు లేకుండా పోయింది ?
అకాల వర్షాలు – ప్రభుత్వాల మొద్దు నిద్ర!
మండు వేసవిలో వర్షాలు… రాకాసి వర్షాలు… రైతులు కష్టించి పండించిన పంట నేలపాలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఎటు వైపు చూసినా రైతుల కన్నీటి ధారలే. రోడ్ల మీద, మార్కెట్ యార్డు ల్లో వరిధాన్యం తడిసి నీళ్లల్లో కొట్టుకుపోతున్న దృశ్యాలు గుండె తరుక్కుపోయేలా చేస్తున్నాయి. మామూలుగా అయితే ఇలాంటి సమయమంలో పంటల్ని ఎండబెట్టుకుంటారు. కానీ ఇప్పుడు అకాల వర్షాలతో తడిచిపోయిన వాటిని ఆర బెట్టుకోవాల్సి వస్తోంది. వర్షాలు పడతాయని వాతావరణ వేత్తలు ప్రకటించగానే వాటి బారి నుంచి ఎలా తప్పించుకోవాలన్న సోయి కూడా ప్రభుత్వాలకు ఉండటం లేదు. అకాల వర్షాలు రైతు లకే కాదు,ప్రభుత్వాలకు పరీక్షగా మారాయి.కల్లాల్లో ధాన్యం తడిసి పోయి లబోదిబో మంటున్న రైతులను ఆదుకు నేందుకు తడిసిన ధాన్యాన్ని కొంటామని ప్రభు త్వాలు వాగ్దానాలను గుప్పిస్తుంటాయి.కానీ, వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తూ ఉంటాయి.అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయంపై సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు కాగి తాలమీదనే ఉంటున్నాయి.వర్షాల నష్టాన్ని అంచనా వేసే కేంద్ర బృందాల పర్యటనలు మొక్కు బడి గానే సాగు తున్నాయి.తదుపరి కార్యాచరణకు నోచు కోవడం లేదు. ఏప్రిల్,మే మాసాల్లో కురిసే అకాల వర్షాలు రైతులకు శాపం అవుతున్నాయి. సంబంధిత శాఖ అధికారులు ఊహించని రీతిలో దెబ్బతీస్తున్నాయి.భూతాపం వల్ల వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయని ఠక్కున చెప్పేస్తారు. అకాల వర్షాల వల్ల తెలంగాణలో పదిలక్షల ఎకరాల్లో పంట నీటమునిగిందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంతే మొత్తంలో నష్టం సంభవించింది. ఈ రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి, రైతులకు భరోసా ఇచ్చేందుకు తడిసిన ధాన్యాన్ని ఒక్క గింజ కూడా వదల కుండా కొంటామని ప్రకటిం చారు. రైతులకు ఇలాంటి సమయాల్లో ధైర్యం చెప్పే వారు కావాలి. అలాంటి పరిస్థితే అంతకంతకూ కరువవుతోంది.
రైతులు అందరికీ అనాథలే !
వ్యవసాయ రంగం ఎప్పటి కప్పుడు కునారిల్లి పోవడానికి కారణం ఈ రంగాన్ని గురించి ఎవరూ పట్టించుకోకపోవడమే. పారిశ్రామిక వేత్తలు తమ వాణిని వి నిపించుకునేందుకు తమ ప్రతి నిధులనుఎంపీలుగా గెలిపించుకుంటూ ప్రత్యేక లాబీలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.. గతంలో వ్యవసాయ రంగం తరఫున వాదించేవా రుండేవారు. ఇప్పుడు అందరూ రైతే రాజు అని జపం చేస్తూ పారి శ్రామిక వేత్తల కు సాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగం ఎవరికీ పట్టని అనాధలా మారిపోయింది. వ్యవసాయ రంగం ఒక్క మాటలో చెప్పాలంటే శాపగ్రస్థంగా తయారైంది. పాలకుల్లో కూడా నిర్లిప్తత ఏర్పడుతోంది. ఈ రంగాన్ని ఉద్దరించేందుకు గతంలో రైతు నాయకులు నిజాయి తీగా,అంకిత భావంతో కృషి చేసేవారు. ఇప్పుడు అలాంటివారు ఎవరూ లేరు.ఇది ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితమైనసమస్య కాదు. దేశమంతటా ఉంది. ముఖ్యంగా ఆహార ధాన్యాలను పండించే రాష్ట్రాల్లో కనిపించే ఉమ్మడి సమస్య.ఈ సమస్యపై పోరాటాలు చేసిన వారు రైతు నాయకుల య్యా రు.వారిలో కొందరు జాతీయ నాయకులయ్యా రు.అయితే,రైతుల సమస్య ఎప్పటికీ పరిష్కారం కాని సమస్యగానే మిగిలిపోతోంది. ఇందుకు కేంద్రం వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ మంత్రులను సమావేశ పర్చి నిర్ణీత కాల పరిమితిలో అమలు జేయదగిన పథకా లు,ప్రణాళిక లను అమలు జేయకపోవడమే.వ్యవసాయ రంగాభి వృద్దికి కృషి చేసే వారికి గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలను ప్రకటించేవి. ఇప్పుడు అరకొరగా అవి సాగుతున్నాయి. అన్నీ ఓటు బ్యాంక్ రాజకీయాలే చేస్తున్నాయ. ఫలితంగారైతుల అకౌంట్లో ఐడాదికి ఐదారు వేలు అదీ కూడా.. సగం మందికే వేసి.. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయి. కానీ రైతులకు చేయాల్సిన మేలు చేయడం లేదు.
విపత్తులొచ్చినప్పుడు ప్రభుత్వాల తీరు చూస్తే రైతులకు ధైర్యం ఉంటుందా ?
ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం జరిగితే..వెంటనే కేసీఆర్ పర్యటించి.. ఎకరాకు రూ. పదివేల చొప్పున ప్రకటించారు. కానీ ఎవరికీ అందలేదు. ఆ విషయం బయటకు రాకుండా సెక్రటేరియట్ ప్రచార సంరంభంలో అందర్నీ పడేశారు. ఇప్పుడు మళ్లీ వర్షాలొచ్చాయి. మరిన్ని లక్షల ఎకరాల్లో పంట మునిగింది. ఇప్పటికీ రైతులను మభ్య పెడుతున్నారు. పరిహారం ఇస్తామంటున్నారు. కానీ ఇస్తారో లేదో తెలియడం లేదు. ఏపీలో పరిస్థితి మరీ దారుణం. తుపానులు ఆపలేమని వ్యవసాయ మంత్రి వాదిస్తున్నారు. తుపాలను ఆపలేకపోవచ్చు కానీ.. మందస్తు జాగ్రత్తలు తీసుకోవడం.. నష్టపోయిన వారికి సాయం అందించకుండా ఎవరు అడ్డుకున్నారన్న ప్రశ్నలువస్తున్నాయి. గత నాలుగేళ్ల కాలంలో ఎన్నో విపత్తులు రైతుల్ని అతలాకుతలం చేశాయి. కానీ ఒక్క సారంటే ఒక్క సారీ పరిహారం ఇవ్వలేదు. సీఎం సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాం కూలిపోతేనే పరిహారం ఇవ్వలేకపోయారు. వారిని రోడ్డున పడేశారు. ఇప్పుడు పరిహారం అంచనా వేస్తున్నామని అదనీ.. ఇదనీ చెబుతున్నారు. కానీ పరిహారం ఇస్తామని మాత్రం చెప్పడం లేదు. ఏపీలో ఇప్పటికి ఎన్ని తుపాన్లు వచ్చాయో లెక్క లేదు. కానీ ఒక్క రైతునూ ఆదుకున్న సందర్భం లేదు. మాండోస్ సహా అనేక తుపానులు వచ్చాయి. పోయాయి. పోతూ పోతూ రైతుల్ని తీవ్రంగా నష్టపరిచాయి. ఆ నష్టం కళ్ల ముందు ఉంది. పెద్ద ఎత్తున రైతులు తమ ఆవేదనను చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి ప్రభుత్వం ఏం చేస్తోంది ? ఏమీ చేయడంలేదు. ఒక్కరూ చనిపోకపోవడం తమ కృషి ఫలితమేనని చెప్పుకుంటోంది. ఎవరైనా చనిపోతే.. బతికున్న వారంతా తమ కృషి వల్లే బతికారని చెప్పుకుంటుంది. గత మూడున్నరేళ్లుగా జరుగుతోంది ఇదే. విపత్తులొస్తే ప్రభుత్వం ముసుగుతన్ని పడుకుంటుంది. ప్రజలు వాళ్ల సావు వాళ్లు సావాల్సిందే..!ఏపీలో అత్యధిక తీర ప్రాంతం ఉంది. సహజంగా తుపానుల ముప్పు ఎక్కువ. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం ఎక్కువగా అప్రమత్తంగా ఉండాలి. కానీ.. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఏ విపత్తు విషయలోనూ ముందస్తు హెచ్చరికలు ఉన్నా అప్రమత్తమయిందే లేదు. చాలా తుపానులు వచ్చాయి… వరదలు వచ్చాయి. కానీ బాధితులు ఎప్పటికప్పుడు నష్టపోతూనే ఉన్నారు.. కానీ ప్రభుత్వం చలించలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి డ్యాములే కొట్టుకుపోయిన దుస్థితి.అప్పులు తెచ్చి.. ఆరుగాలం శ్రమించి పంటలు వేసుకుంటే ప్రకృతి వైపరీత్యాలు దెబ్బతీస్తే… ఆదుకోవడం ప్రభుత్వం కనీస బాధ్యత. ఇలాంటి వైపరీత్యాలు వచ్చినప్పుడు గత ప్రభుత్వం ఎకరానికి రూ. పదివేల వరకూ ఇచ్చేది. అప్పట్లో జగన్ ఆయా ప్రాంతాలను పరిశీలించి.. సెక్యూరిటీ గార్డును ఒంగోబెట్టి.. ఆయనపై చేయి ఆసరాగా పెట్టుకుని మరీ.. మాట్లాడి.. ప్రభుత్వం రూ. పదివేలేనా ఇచ్చేది.. కనీసం పాతికవేలైనా ఇవ్వాలని ప్రసంగాలు దంచేవారు. ఆయన సీఎం అయ్యారు.. పాతిక వేలు కాదు కదా.. పాతిక పైసలు కూడా ఇవ్వడం లేదు. ఎన్ని తుపానులు వచ్చినా రైతులకు అందిన సాయమే లేదు. చివరికి అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి పొలాల్లో ఇసుక మేటలు వస్తే…దాన్ని తీసేందుకూ సాయం చేయలేదు. ఎప్పటికప్పుడు పరిహారం … అంటూ ఇన్ పుట్ సబ్సిటీ కి మీట నొక్కుతూంటారు. దీని ద్వారా నాలుగైదు వందలు రైతులకు అందుతూంటాయి. కొన్నాళ్ల క్రితం ఇలా వరదలు వచ్చినప్పుడు కేరళ ఎంపీ ఒకరు సీఎం సొంత జిల్లా కడపకు వచ్చారు. భారీ తుపాను వస్తూంటే… అధికారులు ఎలా పని చేస్తున్నారో చూద్దామని కడప కలెక్టరేట్‌కు వెళ్లారు. అక్కడ ఎవరూ లేరు. పోనీ ఫీల్డ్‌లో ఉన్నారేమో అనుకున్నారు. కానీ వివరాలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. సెకండ్ సాటర్ డే అని ఎవరూ రాలేదట. ప్రభుత్వం కూడా అంతే. అయితే ప్రభుత్వానికి ప్రతీ రోజూ.. సండే..సెకండ్ సాటర్ డేనే. అలా ఉంటుంది ప్రభుత్వ పని తీరు.
రైతుల విపత్తు నిధులను మళ్లించేంత దుర్భర పాలన !
విపత్తులు సంభవించినప్పుడు నష్టపోయిన రైతులకు ఇవ్వాల్సిన రూ. వెయ్యి కోట్లను ఏపీ ప్రభుత్వం మళ్లించేసింది. ఈ మొత్తాన్ని ఇన్పుట్ సబ్సిడీ పేరుతో పంపిణీ చేశారని.. వాస్తవంగా రైతులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక మంత్రి పంకజ్ చౌదరి నేరుగా పార్లమెంట్‌లోనే ప్రకటించారు. విపత్తుల సమయాల్లో రైతులకు ఇవ్వాల్సిన రూ.1,100 కోట్ల విపత్తు నిధులను ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్ ఖాతాకు మళ్లించారు. ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఆ నిధులను మళ్లించారని కేంద్రమంత్రి తన సమాధానంలో తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు మాత్రం ఆ నిధులు అందించలేదని తెలిపింది. అలాగే ఈ వ్యవహారం విపత్తు నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. రైతులకు ఇవ్వాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ వేరు.. విపత్తలు వచ్చినప్పుడు చేసే సాయం వేరు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడనే విపత్తుల సాయం కింద ప్రకటిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి రూ. పది వేల చొప్పున ప్రకటించి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.కానీ .. ఏపీ వైపు నుంచి ఇప్పటి వరకూ పంట నష్టపరిహారంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. రైతు బాగున్నారని..చిరునవ్వ చిందిస్తున్నారని చెప్పుకుని ప్రచారం చేసుకుంటే బాగోదు. వారిని ఇంకా మోసం చేసినట్లవుతుంది. ఇప్పటికైనా రైతల గురించి ప్రభుత్వాలు పట్టించుకుని వారిని కాపాడితేనే రాజ్యం బాగుంటుంది. లేకపోతే ఆ నష్టం సమాజానికి ఉంటుంది. ప్రభుత్వాలు ఇవాళ ఉంటాయి.. రేపు ఉండవు..కానీ రైతులు దేశానికి చేస్తున్న సేవ మాత్రం శాశ్వతం. వారిని కాపాడుకోవాలి.. ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.