ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ఎంత గొప్పగా నడిపించబోతోందో మొదటి నేల క్లారిటీ వచ్చేసింది. తొలి నెలలో ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా పన్నెండు వేల కోట్ల లోటు కనిపించింది. ఇంటే ఇంత పెద్ద మొత్తంలో అప్పులు లేకపోతే.. చెల్లింపుల నిలిపివేతతో నెట్టుకొచ్చింది. ఏప్రిల్లో కేవలం రూ.8,147 కోట్లు ఆదాయం రాగా, వ్యయం మాత్రం ఏకంగా రూ.20,320 కోట్లు రికార్డు అయినట్లు తేలింది. దీంతో రూ.12,173 కోట్లు లోటుగా ఉన్నట్లు తేలింది. ఏప్రిల్లో సెక్యూరిటీ వేలం ద్వారా ఆరువేల కోట్లను రుణంగా తీసుకున్నారు. అయినప్పటికీ ఇంత లోటు ఉండటం అసాధారణం అని అధికారులు గగ్గోలు పెడుతున్నారు.
ఈ నెల ఇప్పటి వరకూ అరవై శాతం మందికి జీతాలు రాలేదు.. పెన్షన్లు ఎవరికీ ఇవ్వలేదు. కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం కొత్త అప్పులకు పర్మిషన్ ఇచ్చింది. దాదాపుగా ముఫ్పై వేల కోట్లు అప్పులు తీసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇప్పటికే ఆరు వేల కోట్లు తీసుకున్నారు. మరో మూడున్నర వేల కోట్లు వచ్చే మంగళవారం తీసుకుంటారు. అవి వస్తాయి కాబట్టి ఓడీ తీసుకుని ముందే వాడేసుకుంటారు. కానీ ఓడీని మళ్లీ పదిహేను రోజుల్లో తీర్చాలి. అప్పుల పరిమితి మరో ఇరవై వేల కోట్ల వరకూ ఉంది కాబట్టి తీసేసుకుంటారు. మరి తర్వాత ఏం చేస్తారు ?
ప్రభుత్వం వద్ద పథకాలు అమలు చేయడానికి కూడా నిధులు లేవు. అసలు జీతాలకే తంటాలు పడాల్సి వస్తోంది. చేస్తున్న అప్పులకు తిరిగి చెల్లింపులు కూడా భారంగా మారుతున్నాయి. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం అత్యధికం అప్పుల చెల్లింపులకే తిరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగులకు ఇవ్వాల్సినవి.. ఇవ్వడం లేదు. చిన్న చిన్న బిల్లులూ చెల్లించడం లేదు. కానీ సలహాదారులు..సాక్షికి ప్రకటనలు.. మాత్రం ఆగడం లేదు.