పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో కనీసం ఐదారుగురు ఎమ్మెల్యే సీట్లు తెచ్చి పెడతారని రాజకీయ పార్టీలు ఆశపడుతున్నాయి. కానీ ఆయన మాత్రం జాతీయ పార్టీలతోనే గట్టిగా బేరాలాడుతున్నారు.. ఏదీ తేల్చి చెప్పడం లేదు. పార్టీలో చేర్చుకోవాలని అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ టీం వచ్చి చర్చలు జరిపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పది సీట్లలో రెండు తప్ప ఎనిమిది సీట్లు రాసిస్తామని హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఆయన టెంప్ట్ అయ్యారో లేదో తెలియదు.
తాజాగా బీజేపీ చేరిక కమిటీ కూడా చర్చలు జరిపింది. ఆయన కావాలనుకుంటే ఎనిమిది కాదు మొత్తం పది సీట్లు ఆయనకే ఇస్తామని ఆఫర్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన నుంచి నేరుగా సరైన స్పందన రాలేదు. పొంగులేటి ఇంకేదో కోరుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే పొంగులేటితో చర్చలకు ఈటల బృందం వెళ్లడం.. బండి సంజయ్కు నచ్చలేదు. వాళ్లు వెళ్తున్నట్లుగా తనకు తెలియదని నేరుగానే ప్రకటించారు. అయితే పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు. కానీ ఏదైనా చేరికలు జరిగితే తన ద్వారానే జరగాలని ఆయన కోరుకుంటున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈటల ప్రమేయాన్ని ఆయన సహించలేకపోతున్నారు.
పొంగులేటి ఎన్నికల్లో ఎంతైనా ఖర్చు పెట్టగలరు. ఆయనకు కార్యకర్తల బలం కూడా ఉంది. ఖచితంగా చెప్పాలంటే ఒక జిల్లా మొత్తం ఆయన చేతిలో ఉంది. అక్కడ కాంగ్రెస్ కు బలముంది. కావాలనుకుంటే బీజేపీ కొంతైనా బలాన్ని పుంజుకోగలదు. అందుకే కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఆయనకు గాలం వేస్తున్నాయి. పైగా ఖమ్మం గడ్డ మీద నుంచి బీఆర్ఎస్ తరపున ఒక్కరిని కూడా అసెంబ్లీ గడప తొక్కనివ్వబోనని పొంగులేటి శపథం చేశారు. అదీ ఆయన పట్టుదలకు నిదర్శనమని భావిస్తున్న ఆ రెండు పార్టీలు పొంగులేటి తమ వర్గంలో ఉంటే బావుండునని ఎదురు చూస్తున్నాయి. కానీ ఆయన మాత్రం తనదైన రాజకీయాలతో ఎవరికీ ఏమీ చెప్పడం లేదు.