వైసీపీలో ఓ కట్టుబాటు ఉంటుంది. అదేమిటంటే ఎవరు ఏమి మాట్లాడాలన్నా సజ్జల ఆఫీస్ నుంచి పాయింట్లు వెళ్లాలి. అందులో ఇండికేషన్స్ ఉంటాయి. తిట్టడం.. బాగా తిట్టడం.. కులాన్ని తిట్టడం ఇలా. అలా సజ్జల ఆఫీస్ ముందు తలవంచి వారు చెప్పినట్లుగా మాట్లాడాల్సి వచ్చిన వారిలో బొత్స కూడా ఒకరు. కింది స్థాయి ఎదిగినా ఆయనకు స్వేచ్చ లేదు. అందుకే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఓ కులాన్ని కించపరిచారు. ఓ ప్రాంతాన్ని అవమానించారు. ఇప్పుడు పరిస్థితి అర్థమవుతుందేమో కానీ రూటు మారుస్తున్నారు. సజ్జలలా తాను మాట్లాడలేనని నేరుగా చెబుతున్నారు.
చంద్రబాబును అరెస్ట్ చేస్తామని సజ్జల అనడంపై మండిపడ్డారు. ఇలాంటి కామెంట్స్ చేస్తే రాజకీయంగా అది అవతల వ్యక్తులకు ప్లస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయిని బొత్స విశ్లేషించారు. ఇంత చిన్న లాజిక్ ను సజ్జల ఎలా మిస్ అయ్యారో తనకు అర్దం కావటం లేదని బొత్స అసహనం వ్యక్తం చేశారు. అందులోనూ చంద్రబాబు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తామని, రాజకీయంగా అధికారంలో ఉన్న నేతలు ప్రకటిస్తే, దాన్ని తన అవసరానికి వినియోగించుకొని సానుభూతి ని క్రియేట్ చేసుకోవటంలో చంద్రబాబు సిద్దహస్తుడని బొత్స అభిప్రాయం. సజ్జల వ్యాఖ్యల వల్ల అలాంటి పరిస్దితులను మనమే క్రియేట్ చేసి పెట్టిన వారమవుతామని ఆయన వ్యాఖ్యానించారు. అనవసరంగా ఎదుటి వారికి అవకాశాలను మనమే క్రియేట్ చేసి చేతుల్లో పెట్టే పద్దతి తనది కాదని సజ్జల అలా ఎందుకు మాట్లాడారో కాని తానయితే అలాంటి మాటలు చెప్పనంటూ బొత్స స్పష్టం చేశారు.
బొత్స ఏ ఉద్దేశంతో అన్నారో కానీ ఇప్పుడు ఇవి వైసీపీలో చర్చనీయాంశమవుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అవుతారనే ప్రకటనలు చేయాలని సజ్జల ఆఫీస్ నుంచి మంత్రులు అందరికీ సూచనలు వెళ్లాయి. అందుకే రోజా, జోగి రమేష్ సహా చాలా మంది మంత్రులు అదే ప్రకటనలు చేస్తున్నారు. కానీ బొత్స సత్యనారాయణకు మాత్రం అలా అనడం నచ్చలేదు. సజ్జల తరహాలో తానైతే కామెంట్స్ చేయనని స్పష్టం చేశారు. దీంతో బొత్సలో ఏదో తేడా కనిపిస్తోందని.. వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.