Ugram movie review
రేటింగ్: 2.5/5
అల్లరి నరేష్ వైవిధ్యమైన నటుడే. అయితే నటుడిగా అతడి ‘ప్రాణం’ కంటే కితకితలనే ఎక్కువ ఇష్టపడ్డారు ప్రేక్షకులు. దీంతో ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు వరుసగా కామెడీ సినిమాలని చేసుకుంటూనే వెళ్ళారు. అయితే ఒక దశలో అవి స్ఫూప్ లకు దారి తీసి ప్రేక్షకులకు బోర్ కొట్టడం మొదలైయింది. ఈ దశలో ‘నాంది’ విజయం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. నరేష్ ని సీరియస్ పాత్రల్లో కూడా చుస్తారనే నమ్మకం కలిగించింది. ఇప్పుడు అదే కాంబినేషన్ లో ఉగ్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి నాంది కాంబినేషన్ వర్క్ అవుట్ అయ్యిందా ? నరేష్ లో ఉగ్ర రూపం ప్రేక్షకులకు నచ్చిందా? నరేష్ కి మరో విజయం దక్కిందా ?
శివ కుమార్ (అల్లరి నరేష్) నిజాయితీ గల పోలీస్ అధికారి. సిఐ గా విధులు నిర్వహిస్తుంటాడు. అపర్ణ (మిర్నా మీనన్)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వీరికి లక్కీ (బేబీ ఊహ) అనే పాప వుంటుంది. ఒకరోజు వీరు ముగ్గురు ఓ కారు ప్రమాదానికి గురౌతుంది. ఆ ప్రమాదంలో శివ తలకు దెబ్బ తగులుతుంది. కాసేపటి తర్వాత స్పుహలోకి వచ్చిన శివ .. భార్య, బిడ్డని హాస్పిటల్ లో జాయిన్ చేస్తాడు. అదే హాస్పిటల్ లో కాసేపు కునుకు తీసిన శివ.. మెలకువ వచ్చిన తర్వాత తన భార్య,బిడ్డ ఎలా వున్నారని అక్కడ స్టాఫ్ ని అడుగుతాడు. ‘అసలు నువ్వు ఎవరు’అని ప్రశ్నిస్తుంది హాస్పిటల్ సిబ్బంది. రికార్డ్స్ చెక్ చేస్తే అసలు భార్య, కూతురుని హాస్పిటల్ లో చేర్చినట్లుగా ఆధారాలు వుండవు. సిసి టీవీ పుటేజ్ చెక్ చేస్తే.. శివ ఒక్కడే హాస్పిటల్ కి వచ్చిన రికార్డ్ అయివుంటుంది. మరి శివ భార్య, కూతురు ఏమయ్యారు ? ఎక్కడి వెళ్లారు ? వారిని వెదికి పట్టుకోవడానికి శివ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ? అనేది మిగతా కథ.
కొన్నిసార్లు సినిమా తీయడం కంటే ట్రైలర్ కట్ చేయడంలో ఎక్కువ లెక్కలు వేసుకోవాలి. ఉగ్రం ట్రైలర్ కట్ చేయడంలో దర్శకుడి లెక్క తప్పేసిందని సినిమా చూసిన తర్వాత అర్ధమౌతుంది. ట్రైలర్ లో కథ చెప్పేశాం, మిస్సింగ్ కేసులు గురించిన కథ ఉగ్రం.. అని ప్రెస్ మీట్లు పెట్టిమరీ చెప్పారు. పేపర్ లో వచ్చిన ఆర్టికల్స్ ఈ కథకు ఆధారం అన్నారు. కథ ముందే చెప్పేశారంటే ఎంత రీసెర్చ్ చేసి, ఎన్ని కొత్త విషయాలు చూపిస్తారో అనే ఆసక్తి సహజంగానే పెరుగుతుంది. అయితే ట్రైలర్ లోనే కథ చెప్పడం వెనుక దర్శకుడి ఆలోచన ఏమిటో గానీ.. ఈ కథని చూపించడానికి తను ఎంచుకున్న విధానం.. తేడా కొట్టేసింది.
మిస్సింగ్ కేసులని ట్రైలర్ చెప్పాం.. ఫస్ట్ హాఫ్ అంతా ఒక డిఫరెంట్ సెటప్ పెట్టుకున్నాం, అది ప్రేక్షకులని ఎక్సయిట్ చేస్తుందనేది దర్శకుడు విజయ్ కనకమేడల లెక్క కావచ్చు. కానీ ఈ లెక్క తప్పింది. ఉగ్రం ఫస్ట్ అంతా కోసేసినా ఈ కథకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదంటే అర్ధం చేసుకోవచ్చు..ఈ ఫస్ట్ హాఫ్ ఎంత అనవసరనమైన ట్రాక్ గా మారిందో.
కారు ప్రమాదం, హీరో జ్ఞాపకశక్తి… సంబంధించిన ఎపిసోడ్ తో కథని కాస్త ఆసక్తిగానే మొదలుపెడతారు. హీరో పరిచయమైన సన్నివేశం కూడా మాసీగా తీశారు. అయితే తర్వాత వ్యవహారం అంతా ఫైటు తర్వాత ఒక పాట అన్నట్టుగా తయారైయింది. హీరో ప్రేమ, తాళిని కూడా తెంచి హీరో వెంట నడిచిన హీరోయిన్.. ఇవన్నీ చూస్తున్నపుడు అసలు వీటికి కథతో ఏం సంబంధం, కథలోకి వెళ్ళడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు చేస్తున్నారనే ప్రశ్న అడుగడుగా తలెత్తుతుంది. ఇంటర్వెల్ కి ముందైనా కథలోకి వెళ్తారా అంటే.. నలుగురు వీధి గుండాలతో నడిపిన దూలగుండాకు ఎపిసోడ్ కూడా సాగదీయడానికి, హీరోయిజం ఎలివేట్ చేయడానికి వాడుకున్నారే తప్పితే దానితో కథకు ఎలాంటి ఉపయోగం లేదు. బలహీనమైన ఓ సన్నివేశంతో ఇంటర్వెల్ కార్డ్ కూడా పడిపోతుంది.
ఫస్ట్ లో ఇంత ఫ్యామిలీ డ్రామా చూపించడానికి కారణం.. హీరో తన కుటుంబాన్ని కోల్పోయాడనే ఎమోషన్ ని ప్రేక్షకులకు ఎక్కించాలనేది దర్శకుడి ఆలోచన అనుకుందాం. అయితే ఇలాంటి కథని చెప్పడానికి ఈ ఆలోచన కూడా సరైనది కాదనే చెప్పాలి. ఒక నిజాయితీ గల పోలీసు ఆఫీసర్.. తన భార్య బిడ్డలు తప్పిపోతే గానీ మిస్సింగ్ కేసుని సీరియస్ గా తీసుకోడా?(అప్పటికే ఒక్క సీన్ కి పరిమితమయ్యే జూనియర్ ఆర్టిస్ట్ లు హీరో పని చేసే స్టేషన్ లో మిస్సింగ్ కేసులు పెడుతుంటారు) తన భార్య బిడ్డలు మిస్ అయితే కానీ ఫీలవ్వడా? నిజానికి ఇలాంటి కేసుల్లో ఇంట్లో వాళ్ళ కంటే అభాగ్యులు వైపే నిలబడి వాళ్ళ కోసం హీరో పోరాడితే మరింత మాస్ అప్పీల్ వస్తుంది.
ఇక అసలు కథ సెకండ్ హాఫ్ లో మొదలైన తర్వాత మిస్సింగ్ కేసులపై కొత్త రీసెర్చ్ ఎదో చేశారని ఆశపడితే మాత్రం నిరాశ తప్పదు. ఈ కేసులో హీరో విచారించే తీరు అంత బలంగా వుండదు. ప్రమాదం జరిగిన స్థలంలో సిసి కెమరాలు లేవని చెప్పడం, చేతి గాజు ముక్కలు సహాయంతో లేడి రౌడీలని విచారించడం.. ఏదో అలా జరుగుతుందే తప్పితే ఒక ఉత్కంఠ రేకెత్తించదు. క్లైమాక్స్ కి ముందు వచ్చే హిజ్రాల ఫైట్ మాత్రం పవర్ ఫుల్ గా తీశారు.
ఈ కథలో తప్పిపోయిన వారు ఎక్కడున్నారనేది ఆసక్తికరమైన విషయం. అయితే అది రివిల్ చేసిన తీరు కొత్తగా ఎదో చెప్పారనే ఫీలింగ్ అయితే ఇవ్వదు. కిడ్నాప్ చేసిన వారిని ఎలాంటి పనులకు వాడుతుంటారో ఇదివరకే చాలా సినిమాల్లో చూశాం. ఉగ్రంలో కూడా అలాంటి ఓ కోణమే కనిపిస్తుంది. హీరో విలన్ మధ్య అసలు సంఘర్షణనే లేని ఓ భారీ ఫైట్ తో కథకు ఎండ్ కార్డ్ పడిపోతుంది.
నరేష్ ఉగ్ర రూపం చూపించలేదు కానీ కొత్తగా కనిపించాడు. చాలా సీరియస్ టోన్ లో నటించాడు. అయితే ప్రతిదానికి అంత తీవ్రంగా రియాక్ట్ అయ్యే పాత్రతో ఈ కథకు ప్రత్యేకంగా వచ్చిన మేలేమీ లేదు. యాక్షన్ సీన్స్ లో కష్టపడ్డాడు. తన యాక్షన్ కూడా మరీ అతిగా లేదు. మిర్నా మీనన్ ఫర్వాలేదనిపిస్తుంది. గుండాలు ఆమెను తీవ్రంగాఅవమానించిన సన్నివేశంలో ఆమె నటన బావుంటుంది. పాపగా చేసిన ఊహ క్యూట్ గా వుంది. శ్రత్రు ఓకే అనిపిస్తాడు. డాక్టర్ గా చేసిన ఇంద్రజ ఆ పాత్రకు రాంగ్ ఛాయిస్. జబర్దస్త్, మల్లెమాల ఆమెకు ఇప్పుడు మీమ్, ట్రోలింగ్ ఇమేజ్ ఇచ్చింది. ఉగ్రం లాంటి సీరియస్ సినిమాలో, సీరియస్ సీన్ లో ఆమె కనిపిస్తుంటే థియేటర్ లో ప్రేక్షకులు. డెప్త్..ఇంకా డెప్త్.. అంటూ నవ్వుతున్నారు. పైగా ఆమెకు ఇచ్చిన ట్రాక్ కూడా చిరాకైనది. ‘మీ ఆరోగ్యం బాలేదు ఇపుడు మీరెక్కడికి కదలకూడదు’’అని జాగ్రత్తలు చెప్పే బీసీ కాలం నాటి డాక్టర్ పాత్ర. మిగతా పాత్రలకు పెద్ద ప్రాధన్యత లేదు. ఇందులో విలన్ ని చివరి సీన్ కి పరిమితం చేయడం మరో పెద్ద లోపం.
శ్రీచరణ్ నేపధ్య సంగీతం హెవీగా చేశాడు. సిద్ డివోపీ బావుంది. నైట్ మోడ్ లో విజువల్స్ ని బాగా క్యాప్చర్ చేశాడు. ఫస్ట్ హాఫ్ తో పాటు యాక్షన్ సీన్స్ ని బాగా కుదించే అవకాశం వుంది. అబ్బూరి రవి రాసిన మాటలు పెద్దగా ఆకట్టుకోవు. నాందితో ఒక సీరియస్ కథని నిజాయితీ ప్రజంట్ చేశాడు దర్శకుడు విజయ్. ఉగ్రంలో కూడా అలాంటి సీరియస్ టాపిక్ దొరికింది. కానీ దీనికి కమర్షియల్ అద్దకం ఎక్కువైపోయి ఉగ్రం కాస్త ఆవలింతగా మారిపోయింది.
రేటింగ్: 2.5/5