బీఆర్ఎస్ పార్టీ పెట్టారనే కానీ ఒక్క మహారాష్ట్ర నుంచి తప్ప ఎవరూ బీఆర్ఎస్లో చేరేందుకు రావడం లేదు. ఆ కిటుకు ఏమిటో చాలా మందికి అర్థం కావడం లేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓ సీక్రెట్ బయట పెట్టారు. అదేమిటంటే.. కిరాయి మనుషుల్ని తీసుకొచ్చి కండువాలు వేసి పంపిస్తున్నారట. ఈ డ్రామా ఆడటానికి ప్రత్యేకంగా ఓ వ్యక్తిని ప్రజాధనం జీతంగా ఇచ్చి మరీ నియమించుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
కొద్ది రోజుల కిందట మహారాష్ట్రకు చెందిన శరత్ మర్కట్ అనే వ్యక్తి ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి బీఆర్ఎస్లో చేరారంటూ ఆ పార్టీ నేతలు హడావుడి చేశారు. చివరికి శరత్ మర్కట్కు సీఎంవోలో ఉద్యోగం ఇచ్చినట్లుగా రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. శరత్ మార్కట్ సీఎం కార్యాలయంలో ప్రైవేట్ సెక్రటరీగా నియమించారని ఆరోపించారు. అతడికి నెలకు లక్షా యాభై వేల జీతం ఇస్తున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం దాచిపెట్టిందన్నారు. పరాయి వ్యక్తులను ఇక్కడికి తీసుకొచ్చి పార్టీ కోసం ప్రజల సొమ్మును వినియోగిస్తున్నాడని మండిపడ్డారు.
వారానికోసారి మహారాష్ట్ర నుంచి చేరికల కార్యక్రమాన్ని శరత్ మర్కట్ నిర్వహిస్తూంటారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ సరిహద్దులోని మహారాష్ట్ర నేతలకు పెద్ద ఎత్తున ఆఫర్లు ఇచ్చి మరీ పార్టీలో చేర్చుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఓ మహారాష్ట్ర వ్యక్తికి జీతం ఇచ్చి మరీ సీఎంవోలో పెట్టుకోవడం వివాదాస్పదమవుతోంది. ప్రస్తుతం చాలా జీవోలను కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతున్నారు. రేవంత్ చెబుతున్న జీవో బయటకు వస్తే సంచలనం అయ్యే చాన్స్ ఉంది.