వైసీపీ నేతలు ఎడుస్తున్నారు. సర్వ నాశనమైపోయామని ఏడుస్తున్నారు. ఇలా ఏడుస్తూ బయపడేవాళ్లు తక్కువే. ఇంట్లోకి వెళ్లి ఏడ్చేవాళ్లు లెక్క లేనంత మంది ఉన్నారు. అది కింది స్థాయి కార్యకర్త నుండి బాలినేని శ్రీనివాసరెడ్డి వరకూ ఉంది. నమ్మినందుకు చెప్పుతో కొట్టుకుంటున్న వారు రోజూ కనిపిస్తున్నారు. సర్వం సమర్పించుకుని గెలిపిస్తే ఇలా చేశావు ఏందన్నా అని మథనపడేవారికిత లెక్క లేదు. ఇలా ఏడ్చే పరిస్థితి వైసీపీ నేతలకు రావడం విచిత్రమే అయినా చేసుకున్న వాడికి చేసుకున్నంత అనుకోక తప్పని పరిస్థితి.
చెప్పుతో కొట్టుకుంటున్న కింది స్థాయి క్యాడర్
మన ప్లేట్లో మన బిర్యానీ అని జగన్ చెప్పిన మాటలు విని కింది స్థాయి కార్యకర్తలు .. ద్వితీయ శ్రేణి నేతలు తమ సొంత సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. జగన్ ను గెలిపించారు. ఈ నాలుగేళ్లలో వాళ్లకు మిగిలింది చిప్పే. మన ప్లేట్ అంటూ.. ఇచ్చారు.. కానీ చివరికి బిర్యానీ కాదు కదా మట్టి పెళ్లలు కూడా ప్లేట్లో చేయలేదు. పనులు చేయించి బిల్లులు ఇవ్వట్లేదు. దీంతో వారంతా చెప్పులతో కొట్టుకుంటున్నారు. వారంతా వైసీపీ నేతలే. ఇలా ఎందుకు జరిగిందో అందరికీ తెలుస్తూనే ఉంది.
ఓ స్థాయి నేతలకూ తప్పని ఏడుపులు !
చిత్తూరులో ఓ జడ్పీటీసీని ఎంత దారుణంగా అరెస్ట్ చేశారో.. చూసిన తర్వాత వైసీపీ నేతలకు ఓ క్లారిటీ వచ్చింది. తామూ వేరు కాదని.. నోరెత్తితే అదే ట్రీట్ మెంట్ అని అర్థం చేసుకున్నారు. ఇక వర్గ పోరాటంతో ఒకర్ని తొక్కేయడానికి మరొకరు చేసే పనులతో వారంతా చితికిపోతున్నారు. సీఎం జగన్ పార్టీ నేతలందర్నీ తమ వారిగా చూడటం లేదు. ఓ వర్గమే తనతో ఉంటుందని..మిగతా వారంతా పార్టీ వారన్నట్లుగా చూస్తున్నారు. ఫలితంగా బాలినేని వంటి వాళ్లకు ఏడుపే మిగులుతోంది.
ఓట్లేసిన ప్రజలూ ఏడుస్తున్నారు..!
వైసీపీకి ఓట్లేసినా ప్రజలూ ఏడుస్తున్నారు. జగన్ కు ఓట్లేసిన దిగువ మధ్యతరగతి జనాల్ని మద్యం రేట్లు పెంచి పీల్చి పిప్పి చేసేశారు. వారికి రేషన్ బియ్యం తప్ప దిక్కు లేని పరిస్థితికి తెచ్చారు. ఇళ్ల పేరుతో అప్పుల పాలు చేశారు. ఉపాధి లేకుండా చేశారు. ఇప్పుడు ఆ జగన్ ఓటు బ్యాంక్ మొత్తం దినావస్థలో ఉంది. వారు నిరుపేదలు కాబట్టి వారి ఏడుపులు ఎవరికీ పట్టడం లేదు. ఇక ప్రభుత్వ విధానాలతో సగం ప్రజల జీవితం నాశనమైపోయింది. వారంతా ఏడుస్తున్నారు. మొత్తంగా వైసీపీ పాలన ఏడుపుగొట్టులా మారిపోయింది.