ఎన్ని విపత్తులు వచ్చిన రైతుల వైపు కూడా చూడటానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధపడటం లేదు. అయితే ఈ సారి మాత్రం పరిస్థితి తేడాగా మారుతోంది. ఇదేం ప్రభుత్వం అని రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతూండటం.. చంద్రబాబునాయుడు వారం అయినా సరే.. రైతుల కష్టాలు తీరే వరకూ పర్యటిస్తానని ప్రకటించడంతో ప్రభుత్వం మేలుకుంది. అకాల వర్షాలకు పంట నష్టపోయిన ప్రాంతాల్లో వైసీపీ క్షేత్రస్థాయి పర్యటించాలని తమ నేతల్ని ఆదేశించింది. తమ పరిధిలో వర్షాల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించాలని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్లు, నేతలకు సమాచారం పంపారు.
అయితే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు ఇప్పుడే బిక్కుబిక్కుమంటున్నారు. ప్రభుత్వం రైతుల్ని పూర్తిగా గాలికొదిలేసింది. చంద్రబాబు పర్యటనకు వస్తున్నారని రాత్రికిరాత్రి ఆయన పర్యటన ఖరారైన చోట మాత్రం కొనుగోలు చేస్తున్నారు. ఇతర చోట్ల చేయడం లేదు. రైతుల్లో ఆ అసహనం కూడా కనిపిస్తోంది. అంతే కాదు ఇంత వరకూ పైసా కూడా సాయం ప్రకటించలేదు. ఇప్పుడు తాము రైతుల వద్దకు వెళ్తే వారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఎక్కువ మంది అనుకుంటున్నారు. ఈ కారణంగానే క్షేత్ర స్థాయి పర్యటనకు జంకుతున్నారు. ముందు రైతులకు ప్రభుత్వం తరపున ఎంతో కొంత సాయం ప్రకటిస్తే ధైర్యంగా వెళ్తామని చెబుతున్నారు.
అసలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి .. సీఎం అయిన తర్వాత ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు పట్టించుకున్న పాపాన పోలేదు. తాను వెళ్తే అధికారుల పనుల అడ్డంకి అనే కారణం చెప్పి అడుగు బయట పెట్టడం లేదు. ముఖ్యమంత్రి వస్తే ఇంకా సీరియస్ గా రైతుల్ని ఆదుకుంటారు కానీ..అసలు ఆయన రాకపోతే ఇక పర్యవేక్షణ ఎలా ఉంటుందనే సంగతిని ఆయన మర్చిపోయారు. రైతుల్ని పూర్తిగా పట్టించుకోవడం మానేయడం.. ఎలాంటి సాయం ఇవ్వకపోతూండటంతో రైతుల్లో పెరిగిపోతున్న అసంతృప్తిని .. ఎమ్మెల్యేల మీద చూపించుకోవచ్చన్నట్లుగా వారిని వెళ్లాలని వైసీపీ పెద్దలు సూచిస్తున్నారు.