తెలంగాణకు చెందిన గోనె ప్రకాష్ రావు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతున్నారు. ఒకప్పుడు వైఎస్‌కు అత్యంత సన్నిహితుడయిన ఆయన రాజకీయాల నుంచి విరమించుకుని చాలా కాలం అయింది. అయితే ఆయనను ఎవరు మోటివేట్ చేశారో కానీ ఇటీవలి కాలంలో ఆయన ఏపీ రాజకీయాల గురించి మాట్లాడటం ప్రారంభించారు. మొదట యూట్యూబ్ చానళ్లకు సర్వేలు, విశ్లేషణలు ఇస్తూ హైలెట్ అయ్యారు. అవి వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు ఆయన నేరుగా ఏపీకి వెళ్లి వైసీపీ అంతర్గత వ్యవహారాల్లో చిచ్చు పెడుతున్నారు.
తిరుమలలో దర్శనం చేసుకుని తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీలో చేరే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో వైవీ సుబ్బారెడ్డిని ప్రశంసించారు. దీంతో ఆయనను సుబ్బారెడ్డి తీసుకొచ్చి తనపై ఇలా చెప్పిస్తున్నారని బాలినేని అనుకున్నారు. ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్లు పెట్టుకున్నారు. బాలినేనిపై గోనె ప్రకాష్ రావు తీవ్ర అవినీతి ఆరోపణలు కూడా చేశారు. అయితే అసలు తెలంగాణకు చెందిన గోనె ప్రకాష్ రావుకు ఏపీలో పనేంటని..తనను టార్గెట్ చేయడమేమిటని ఆయన మండిపడుతున్నారు. కావాలనే మాట్లాడిస్తున్నారంటున్నారు.
గోనె ప్రకాష్ రావు.. జగన్ పరిపాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. టీడీపీ, జనసేన కలిస్తే్ 150 సీట్లు వస్తాయని .. టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా 100 సీట్లు వస్తాయని జోస్యం చెబుతున్నారు. సర్వేలు చెబుతున్నారు. తానే స్వయంగా ప్రజాభిప్రాయ సేకరణ చేశానని కూడా చెబుతున్నారు. ఆయన ఇంతటితో ఆగేలా లేరని .. వైసీపీకి వ్యతిరేకంగా ఇంకా ఎక్కువ ప్రచారం చేయడానికి సిద్దంగాఉన్నారని వైసీపీ నేతలు నమ్ముతున్నారు. అసలు ఆయన వెనుక ఎవరున్నారా అని ఆరా తీస్తున్నారు.