ఉప్పెనతో నిజంగా ఉప్పెనలానే దూసుకొచ్చింది కృతి శెట్టి. ఆ సినిమాతో వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ‘ఉప్పెన’ తర్వాత మళ్ళీ అలాంటి విజయం ఆమెకు రాలేదు. శ్యామ్ సింగారాయ్ సినిమా వుంది కానీ ఆ క్రెడిట్ సాయి పల్లవి ఖాతాలోకి వెళ్ళిపోయింది. తర్వాత చేసిన దాదాపు సినిమాలు నిరాశ పరిచాయి. ఇందులో కొన్ని స్క్రిప్ట్ ఎంపిక లోపాలూ వున్నాయి. ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావిస్తే చాలా పరిణితితో సమాధానం ఇచ్చింది.
”విజయం అనే వంటకం ఎవరికీ తెలీదు. ప్రయత్నం మాత్రమే మన చేతిలో వుంటుంది. ఈ ప్రయాణంలో ఎత్తుపల్లాలు సహజం. అపజయాల నుంచి పాఠాలు నేర్చుకున్నాను. ఇప్పుడు కథల ఎంపికలో మరింత సెలెక్టివ్ గా ఉంటున్నాను.అయితే ఈ ప్రయాణంలో నాకు ఎలాంటి విచారం లేదు. విజయం ఆనందాన్ని ఇస్తే అపజయం కొత్త విషయాలు నేర్పింది” అని చెప్పుకొచ్చారు కృతిశెట్టి. నాగచైతన్యకు జోడిగా ఆమె నటించిన కస్టడీ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.