కడప వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో అవినాష్ రెడ్డికి బదులుగా ఇతరులను బరిలోకి దింపుతారన్న ప్రచారం వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. విచిత్రంగా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా ఇలా ప్రచారానికి వస్తున్న పేర్లలో ఉంది. అయితే ఆ ఇతరులు బయట వ్యక్తులు కాదని.. వైఎస్ కుటుంబం లోని వారేనని అంటున్నారు. తల్లిని విజయలక్ష్మిని ఒప్పించి ఎంపీ సీటులో నిలబెడతారని.. లేదు జగన్ సతీమణి భారతి నిలబెడతారని కొందరు ప్రచారం చేస్తున్నారు. మరికొన్ని ఇతర పేర్లూ ప్రచారంలోకి వస్తున్నాయి.
వచ్చే ఎన్నికలు జగన్ కు సవాల్ గా మారనున్నాయి. దీనికితోడు వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి ఇరుక్కుంటే అది పెద్ద మరకగా మిగిలిపోనుంది. ఇది వైసీపీకి భారీ ఎదురుదెబ్బ కానుంది. అలాంటి క్లిష్ట పరిస్థితులే ఎదురైతే కడప ఎంపీ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనేది కీలకంగా మారనుంది. గత ఎన్నికల్లో వివేకా హత్యకేసు వైసీపీకి ప్రధాన అస్త్రంగా మారింది. ఓట్ల వర్షం కురిపించింది. ఈ ఎన్నికల్లో అదే ఎదురు దెబ్బ అయ్యేలా ఉందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అధికార పీఠం దిగేలా చేసేలా ఉందని గుబులు పట్టుకుందని టీడీపీ ఎద్దేవా చేస్తోంది.
కడప వైసీపీ నుంచి ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే ఆ పరిణామాలు పార్టీపై ప్రభావం చూపుతాయని జగన్ వర్గం ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సీబీఐ దూకుడు ప్రదర్శిస్తూ పులివెందుల కుట్ర కోణాన్ని వెలికి తీయడం వైసీపీలో కలకలం రేపుతోంది. అవినాష్ కు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు సేకరిస్తోంది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ కూడా రద్దు కావడంతో కేసు మరింత బిగుసుకుని అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే తరువాత ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో వైసీపీ నేతల్లో అయోమయంలో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
నిజాయితీని నిరూపించుకునేవరకూ అవినాష్ రెడ్డిని పక్కన పెడతామని ప్రకటిస్తే… విజయమ్మ లేదా మరొకరు… వైసీపీ ఎంపీ బరిలో నిలిచే అవకాశం ఉంది.