దేశాన్ని ఉద్దరించేస్తామని .. చేశామని తెగ గప్పాలు కొట్టుకునే బీజేపీకి.. ఎక్కడ ఎన్నికలు జరిగినా తమకు చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క మంచి పని ఉండదు. చెప్పుకోలేరు కూడా. వారిదంతా మత రాజకీయం. కథలు చెప్పుకుని .. సెంటిమెంట్ పండించి ఓట్లు దండుకునే వ్యూహమే. కర్ణాటకలో అదే చేస్తున్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రచార సరళి చూస్తే.. ఇదే అర్థం అయిపోతుంది. యడ్యూరప్ప ప్రభుత్వం కానీ.. బొమ్మై ప్రభుత్వం కానీ..తాము కర్ణాటకకు ఫలానా పనిచేశామని ఎన్నికల్లో చెప్పుకోలేదు. మొదటి నుంచి ఏడుపులు, పెడబొబ్బలతోనే ప్రచారం చేస్తున్నారు.
మొదట ప్రధానమంత్రి తనను కాంగ్రెస్ నేతలు తిడుతున్నారని ప్రచారం చేసుకున్నారు. అయినా ప్రజల కోసం పడుతున్నానని.. తనను తిట్టినా పర్వాలేదని.. కానీ కులాల్ని తిడుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రధాని మొదట ప్రసంగాలు ….” చీప్.. వెరీ చీప్ ” అన్న ఫీడ్ బ్యాక్ తీసుకొచ్చాయి. అయితే ఇలాంటివే ఓట్లు తెచ్చి పెడతాయని వారు గట్టిగా నమ్ముతారు. అందుకే మరింత లోకి వెళ్లిపోయారు. చివరికి కేరళ స్టోరీ గురించి కూడా కథలు చెప్పారు. అది ఓ సినిమా. దాన్ని కాంగ్రెస్ కు ముడి పెట్టేసి.. ప్రధాని కూడా విమర్శలు గుప్పించారు. దీంతో దేశ ప్రధానికి కూడా.. అదీ పదేళ్ల పాటు అధికారంలో ఉండి ఏం చేశామో చెప్పుకోలేని దీన స్థితిలో ఓ సినిమా గురించి చెప్పుకుంటున్నారన్న అభిప్రాయం ఆలోచన పరుల్లో కనిపిస్తోంది.
ఇప్పటికే బీజేపీ మొత్తం వదిలేసి.. హనుమాన్ చాలీసా చదువుతోంది. భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ చెప్పిందని.. బీజేపీ ఈ రచ్చ చేస్తోంది. అదేదో హనుమాన్ ఆలయాల్ని నిషేధిస్తున్నట్లుగా హిందువులను రెచ్చగొట్టడానికి గొప్ప టూల్ లాగా వాడేసుకుంటున్నాయి. మీడియా సోషల్ మీడి్యాతో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇది కర్ణాటక ప్రజల్ని తక్కువ అంచనా వేయడమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఫలితాలు ఆ విషయాన్ని తేల్చనున్నాయి.