తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు రేవంత్ రెడ్డికి గొప్ప చాన్స్ వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ సర్కార్‌పై యువత రగిలిపోయే పరిస్థితి వచ్చింది. వారి ఆగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రియాంకా గాంధీని హైదరాబాద్ రప్పించేలా చేసి.. యువ సంఘర్షణ సభ నిర్వహిస్తున్నారు. ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్న ప్లస్ పాయింట్ ను.. పేపర్ లీకేజీలతో వ్యతిరేకంగా మార్చుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. దీన్ని రేవంత్ గట్టిగా పట్టుకుని పోరాడుతున్నారు.
ఇప్పటికే జిల్లాల్లో నిరుద్యోగ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వరంగల్‌లో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీతో రైతు డిక్లరేషన్ ప్రకటింప చేసిన టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రియాంకా గాంధీతో యూత్ డిక్లరేషన్ ప్రకటించేందుకు సన్నాహాలు చేశారు. సరూర్‌నగర్ స్టేడియం వేదికగా 8వ తేదీన నిర్వహించ నున్న సభకు ”యువ సంఘర్షణ సభ”గా నామకరణం చేశారు. తమ ప్రభుత్వం వస్తే ఏం చేయాలనుకుంటున్నామో.. ముఖ్యంగా యూత్‌ను ఎలా ఆదుకుంటామో ప్రియాంకాగాంధీతో ప్రకటింపచేయనున్నారు.
విద్యా ర్థులు, నిరుద్యోగులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వారిని ఆదుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ చెబుతోంది. ఎలా ఆదుకుం టామో యూత్ డిక్లరేషన్‌లో పొందుపరచనున్నారు. కాంగ్రెస్ సభ విజయవంతం అయితే కాంగ్రెస్ హైకమాండ్ వద్ద రేవంత్ రెడ్డి పలుకుబడి మరింత పెరుగుతుంది.అదే సమయంలో యువతలో నమ్మకం పెంచుకుంటే.. కాంగ్రెస్ పార్టీకి అంత కంటే అడ్వాంటేజ్ ఉండదు. అందుకే రేవంత్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు.