ఆంధ్రప్రదేశ్లో జనసేన ఓటు బ్యాంక్ ఎంత..? గత ఎన్నికల్లో ఆరు శాతం ఓటింగ్ వచ్చింది కాబట్టి.. అందరూ ఆరు శాతంగా ఫిక్సవుతున్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత బాగా పెరిగినందున.. ఆ వ్యతిరేకత ఓట్లలో మరో మూడు శాతం వరకూ జనసేనకు రావొచ్చని సర్వేలు చెబుతున్నాయి. మొత్తంగా పదిలోపు ఉండవచ్చని పలు సర్వేలు చెబుతున్నాయి. అయితే జనసేన కొత్త ప్రధాన కార్యదర్శి నాగబాబు మాత్రం జనసేన ఓటింగ్ శాతం 35 అంటున్నారు. ఇప్పుడు జనసేన ఓటింగ్ శాతం 35కి చేరిందని.. పవన్ కల్యాణ్ సీఎం అయితే రాష్ట్రం దశ మారిపోతుందని ఆయన అంటున్నారు.
అనకాపల్లి జిల్లాలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన తర్వాత ఆయన జనసైనికులను ఉద్దేశించి మాట్లాడారు. పొత్తుల గురించి ఎవరూ మాట్లాడవద్దని.. ఎవరూ సలహాలు ఇవ్వవద్దనిపార్టీ నేతలకు నేరుగానే చెప్పిన ఆయన పొత్తులు ఉంటాయో ఉండవో మాత్రం చెప్పలేదు. పవన్ కల్యాణ్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సలహా ఇచ్చారు. జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్నిచోట్లా గెలవడమే లక్ష్యమన్నారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ సీఎం అనే నినాదాన్ని మాత్రం వదిలి పెట్టలేదు.
నాగబాబు వ్యవహారశైలి ఇటీవలి కాలంలో కాస్త భిన్నంగా మారుతోంది. తాను ఎన్నికల్లో పోటీ చేసేది లేదని చెబుతున్నారు. అనకాపల్లిలోనూ అదే చెప్పారు. అయితే గతంలోనూ ఆయన అదే చెప్పారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటే.. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో ఎక్కడ పోటీ చేసినాగెలుపు సునాయాసం అన్న సూచనలు ఉండటంతో ఈ సారి నాగబాబు బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నారని భావిస్తున్నారు. ప్రజాప్రతినిధి కావాలని ఎవరికి మాత్రం ఉండదని జనసేనలో సెటైర్లు వినిపిస్తున్నాయి.