ఖుషి సినిమాతో ముగ్గురి జాతకాలు, కెరీర్లూ ముడిపడి ఉన్నాయి. లైగర్ తరవాత విజయ్ దేవరకొండ చేసిన సినిమా ఇది. లైగర్ పెద్ద డిజాస్టర్. అంతకు ముందు చేసిన వరల్డ్ ఫేమస్ లవర్, నోటా, డియర్ కామ్రేడ్ ఫ్లాప్ అయ్యాయి. కానీ లైగర్ మాత్రం పెద్ద దెబ్బ. వాటి తరవాత వస్తున్న సినిమా ఖుషి. విజయ్ స్టార్ డమ్ నిలవాలంటే ఈ సినిమా పెద్ద హిట్టవ్వడం చాలా అవసరం. సమంత కూడా ఇదే పొజీషన్లో ఉంది. లేడీ ఓరియెంటెడ్ కథల్ని నమ్ముకొని బాగా నష్టపోయింది సమంత. యశోద తనని తీవ్రంగా నిరాశ పరిచింది. శాకుంతలం అయితే చెప్పక్కర్లెద్దు. తన స్క్రీన్ ప్రెజెన్స్పైనా అనుమానాలు తీసుకొచ్చిన సినిమా. ఇక… దర్శకుడు శివ నిర్వాణ. కెరీర్‌ని చక్కటి విజయాలతో ప్రారంభించిన శివ నిర్వాణ.. టక్ జగదీష్‌తో తొలి ఫ్లాప్ అందుకొన్నాడు. ఆ సినిమాతో తనపై కూడా డౌట్లు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ ముగ్గురూ కలిసి చేస్తున్న సినిమా ఇది. సమంత అనారోగ్యంతో ఈ సినిమా బాగా లేటయ్యింది. లేదంటే ఈపాటికి వచ్చి వెళ్లిపోయేది కూడా. ఇప్పుడు నవంబరు 1కి వాయిదా పడింది. ఆ డేట్ కి ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సినిమా వచ్చేస్తుంది. అంత వరకూ ఆగకుండా.. మెల్లమెల్లగా ప్రమోషన్లు కూడా మొదలెట్టేశారు. పాటలు, గ్లింప్స్ ఒకొక్కటిగా విడుదల చేస్తూ, ఈ సినిమాపై బజ్ పెంచుకొనే ప్రయత్నాల్లో ఉంది చిత్రబృందం. ఖుషి చాలా పాజిటీవ్ టైటిల్. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి ఓ స్వీట్ మొమొరీ. మరి అదే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా.. ఈ ముగ్గురి జీవితాల్లోనూ పాజిటీవ్‌నెస్, ఖుషీ.. తెస్తుందో లేదో చూడాలి.