తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ చాలా సార్లు అభిమానం చూపించారు. అయితే అది కేంద్ర స్థాయిలోనే. రాష్ట్ర స్థాయిలో మాత్రం ఎప్పుడూ ఆ పార్టీని ఫినిష్ చేసే ప్రయత్నమే చేశారు. అయితే ఎలాగోలా తట్టుకుని రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేసిన తర్వాత ఆ పార్టీ కొద్దిగా పుంజుకున్నట్లుగా కనిపిస్తోంది. అప్పట్నుంచి కేటీఆర్.. కాంగ్రెస్ హైకమాండ్ పై విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. రేవంత్ నే టార్గెట్ చేస్తూ ఉంటారు. రేవంత్ కు పీసీసీ చీఫ్ ఇవ్వడమే తప్పని చెబుతూంటారు.
తాజాగా ప్రియాంకా గాంధీ యువ సంఘర్షణ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న సమయంలో కేటీఆర్ మరోసారి అదే వాదన వినిపించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ బలిదేవత అన్న వ్యక్తికే పీసీసీ చీఫ్ పదవి ఇచ్చారని . గాంధీ భవన్‌ను గాడ్సేకు అప్పగించి తన అంతానికి కాంగ్రెస్ వీలునామా రాసుకుందని తాజాగామండిపడ్డారు. ఇది కాంగ్రెస్ అమాయకత్వమో, ఆత్మహత్యా సదృశ్యమో తేల్చుకోవాలని సలహా ఇచ్చారు.
కేటీఆర్ మాటలు వింటే… కాంగ్రెస్ హైకమాండ్‌కు కోపం రాకుండా ఉంటుందా ? రెండు సార్లు తమ పార్టీ ఎమ్మెల్యేల్ని పూర్తి స్థాయిలో లాగేసుకుని.. సీఎల్పీల్ని విలీనం చేసుకుని ఇక పార్టీ లేదు అనే ప్రచారం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బతకడం గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారనే అసహనం వారిలో కనిపించకుండా ఉంటుంది. కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడేబదులు రాష్ట్ర అంశాలపై మాట్లాడాలని వారు సలహాలిస్తున్నారు.
గతంలో రేవంత్ ను పీసీసీ చీఫ్ గా నియమించినప్పుడే కేటీఆర్.. శశిథరూర్ గురించి .. రేవంత్ అన్నారంటూ కొన్ని మాటల ఆడియోలు పెట్టి.. కాంగ్రెస్ హైకమాండ్ కు ఫిర్యాదులు చేశారు. ఆయనకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తున్నారని క్లారిటీ రాగానే కేసులు పెట్టి జైల్లో వేశారు. అవన్నీ రేవంత్ కు మేలు చేశాయి. హైకమాండ్ .. రేవంత్ పైనే నమ్మకం పెట్టుకుంది. ఇది కేటీఆర్‌కు అసలు నచ్చడం లేదు.