ఏపీ కోర్టు ఓ కేసు విషయంలో అడ్వకేట్ కమిషనర్గా ఓ లాయర్ ను నియమించింది. ఆయన ఆ కేసు అంశంపై వివరాలు తెలుసుకునేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. వచ్చింది కోర్టు నియమించిన మనిషి అని తెలిసి కూడా లోపలేసి కుళ్లబొడిచారు పోలీసులు. అలా కొట్టడానికి కారణాల్లేవు. పోలీసులకు వ్యతిరేకంగా చేస్తున్నారనే కొట్టారు. ఈయన లబోదిబోమని కోర్టుకు మొరపెట్టుకున్నారు. కోర్టు సీరియస్గా తీసుకోవడంతో విషయం పెద్దది అయింది.
ఇదే మొదటిది కాదు.. పోలీసుల చేతుల్లో చావు దెబ్బలు తిన్న లాయర్లు వందల సంఖ్యలో ఉన్నారు. వీరంతా ఇప్పుడు రోడ్ల మీదకు వచ్చారు. పోలీసులు తాము చేస్తున్న అక్రమాలు, దొంగ అరెస్టులు.. దందాల గురించి కోర్టుల్లో వాదించకుండా లాయర్లను భయపెడుతున్నారని కొట్టేందుకు వెనుకాడటం లేదని వారు రోడ్డెక్కారు. ఇప్పుడు లాయర్ల ఆందోలన సంచలనాత్మకంగా మారింది. ప్రభుత్వానికి చేయాల్సింది చేసి.. తాము తమ దందాలు చేసుకుంటున్నందున లాయర్లను కొట్టినా ప్రభుత్వం పట్టించుకోదని వారి నమ్మకం. అదే జరుగుతోంది.దాంతో లాయర్లు అంతా న్యాయదేవతకు మొరపెట్టుకున్నారు.
ఏపీ ప్రభుత్వ వ్యవస్థలు అన్ని.. న్యాయవ్యవస్థ పట్ల వ్యవహరిస్తున్న తీరు మొదటి నుంచి వివాదాస్పదమే. ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తులపైనే నిఘా పెట్టినట్లుగా ప్రచారం జరిగింది. ఆ కేసు ఇంత వరకూ తేలలేదు. న్యాయమూర్తుల్ని బూతుల్ని తిట్టిన కేసులోనూ సీబీఐ అడుగు ముందుకు వేయలేకపోతోంది. ఇప్పుడు పోలీసులు లాయర్లను బడితే పూజ చేస్తున్నారు. ఇక న్యాయం కోసం ఎవరూ మాట్లాడకూడదు..పోరాడకూడదు అంతా పోలీసులు చెప్పిందే శాసనం అన్న పరిస్థితి వస్తుందన్న ఆందోళన కనిపిస్తోంది.