ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరబిందో వారసుడు శరత్ చంద్రారెడ్డికి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిజానికి ఆయన నెలరన్న రోజులుగా బెయిల్ మీద ఉన్నారు. తన భార్య ఆరోగ్యం బాగోలేదన్న కారణంగా ఆయన మొదట నాలుగు వారాలు.. తర్వాత మరో వారం బెయిల్ పొందారు. రెండో సారి బెయిల్ గడువు ముగియక ముందే పూర్తి స్థాయి బెయిల్ కోసం అదే కారణంతో పిటిషన్ వేశారు. తన భార్యకు అనారోగ్యంగా ఉందని.. ఆమె బాగోగులు చూసుకోవాలని.. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టును కోరారు. శరత్ చంద్రారెడ్డి అభ్యర్ధనను ఢిల్లీ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. బెయిల్ మంజూరు చేసింది.
2022 నవంబర్ 09 వ తేదీన శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను విచారించిన ఈడీ అధికారులు.. వారిద్దరినీ ఒకే రోజు అరెస్ట్ చేశారు. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థకు శరత్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. ఈ సంస్థతో పాటు పలు సంస్థల్లో శరత్ చంద్రారెడ్డికి భాగస్వామ్యం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారి పాత్ర ఉందని ..పెద్ద ఎత్తున మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని గుర్తించారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టులు తిరస్కరించాయి. ఇప్పటి వరకూ ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన వారిలో శరత్ చంద్రారెడ్డికి మాత్రమే బెయిల్ లభించింది. మిగతా వారు జైల్లోనే ఉన్నాయి. మరికొంత మంది బెయిల్ పిటీషన్లు విచారణలో ఉన్నాయి.
శరత్ చంద్రారెడ్డి సోదరుడు రోహిత్ రెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు. విజయసాయిరెడ్డి ఇటీవలి కాలంలో వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఏపీకి చెందిన మరో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరు కూడా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉంది. ఆయన కుమారుడు ఇప్పటికే జైల్లో ఉన్నారు.