యువతను పార్టీకి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రియాంకా గాంధీని ముఖ్య అతిథిగా పిలిపించి మరీ ఏర్పాటు చేసిన యువసంఘర్షణ సభలో వారిని ఆకట్టుకునేందుకు రేవంత్ రెడ్డి ఐదు కీలక హామీలను తెరపైకి తీసుకు వచ్చారు. అటు తెలంగాణ ఉద్యమకారులు.. ఇటు యువతను ఒకేసారి టార్గెట్ చేసి.. వారు కాదనేలేని ఆఫర్లను ప్రకటించిందని అనుకోవచ్చు.
మొదటి హామీ.. తెలంగాణ ఉద్యమకారులకు రూ. పాతిక వేల పెన్షన్. అదీ కూడా నెలకు. రెండోది.. ప్రైవేటు సంస్థల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వడం. మూడోది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే రెండులక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం. నాలుగు నిరుద్యోగులకు నెలకు రూ. నాలుగు వేల నిరుద్యోగ భృతి, స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి రూ. పది లక్షల వడ్డీ లేని రుణం ఐదోది. నిజానికి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం లేకపోతే వ్యాపారం పెట్టుకోవడానికి పెట్టుడి సాయం కోసం చూస్తూంటారు. వారి ఆశల్ని పూర్తి స్థాయిలో స్టడీ చేసి మరీ ఈ ఆఫర్ ప్రకటించినట్లుగా కనిపిస్తోంది. వీటితోనే సరి పెట్టలేదు. ప్రపంచ స్థాయి యూనివర్శిటీలు.. యువతకు ఎలక్ట్రిక్ స్కూటర్ల ఆఫర్లు కూడా ఇచ్చారు.
తెలంగాణ యువతను ఆకట్టుకునేలా ప్రియాంకా గాంధీ ప్రసంగించారు. కొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయని, ప్రభుత్వాన్ని ఎన్నుకునేటప్పుడు అప్రమత్తతో ఉండాలని సూచించారు. ‘‘ఈ రాష్ట్రం వాళ్ల జాగీరు అనుకుంటున్నారు. జాగీర్దార్లు అనుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఏ ప్రభుత్వం వచ్చినా మంచి జరుగుతుందని అందరూ నమ్మారు. ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగం ఇస్తానని అప్పట్లో కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? టీఎస్పీఎస్సీ పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయి. వారిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? గత 9 ఏళ్లలో 12 రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఒక్క ఖాళీని కూడా భర్తీ చేయలేదని విమర్శఇంచారు.
తనను ఇందిరమ్మ అంటుంటే నాపై మరింత బాధ్యత పెరుగుతుంది. 40 ఏళ్ల క్రితం చనిపోయిన ఇందిరను ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారు. ఆమెను స్మరించుకుంటూ నేను తప్పుడు హామీలు ఇవ్వలేను. నిజాయతీగా మాట్లాడుతున్నాను. మేమూ సరిగ్గా పని చెయ్యకపోతే మమ్మల్ని కూడా తొలగించండి. యూత్ డిక్లరేషన్ విషయంలో మేం జవాబుదారీగా ఉంటామని భరోసా ఇచ్చరు. రేవంత్ రెడ్డి పక్కాగా ప్లాన్ చేసుకుని ప్రియాంకా గాంధీ క్రేజ్ ను యువతలో పార్టీకి అనుకూలంగా మార్చుకునేలా సభను నిర్వహించడంలో సక్సెస్ అయ్యారని అనుకోవచ్చు