టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ వద్ద తన పలుకుబడి పెంచుకునేందుకు వచ్చే ఏ ఒక్క అవకాశాన్ని నదులుకోవడం లేదు. సీనియర్లు పూర్తి స్థాయిలో సహాయ నిరాకరణ చేస్తున్నా ఆయన లెక్కలోకి తీసుకోవడం లేదు. వారు సహకరించకపోవడమే తనకు మంచిదన్నట్లుగా మొత్తం తన మార్క్ బలప్రదర్శన చేస్తున్నారు. డిక్లరేషన్ల పేరుతో పార్టీ హైకమాండ్ పెద్దలను రప్పించి సభలు పెడుతున్నారు. అవన్నీ సక్సెస్ అవుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ కు రేవంత్ పెద్ద దిక్కు అన్న అభిప్రాయాన్ని వారిలో కల్పిస్తున్నారు.
గతంలో వరంగల్లో రైతు డిక్లరేషన్ ను రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి ప్రకటింపచేశారు. అందులో కీలకమైన హామీగా ధరణి పోర్టల్ రద్దు అంశం ఉంది. ధరణి వల్ల ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ హామీ బాగా ఆకట్టుకుంది. తాము ఇచ్చిన హమీని రైతుల్లోకి తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా ప్రియాంకా గాంధీ ఓ బహిరంగసభలో పాల్గొనేందుకు ఇచ్చిన రెండు, మూడుగంటల సమయాన్ని రేవంత్ రెడ్డి అత్యుత పకడ్బందీగా ఉపయోగించుకున్నారు. యువ సంఘర్షణ సభ పేరుతో సభ పెట్టి యువతకు గుక్క తిప్పుకోలేనన్ని ఆపర్లు ఇచ్చారు. యూత్ డిక్లరేషన్ ప్రకటించి.. అందరూ చర్చించుకునేలా చేశారు.
ఎన్నికల హామీలు ఇవ్వడం కాదు.. వాటిని ప్రజలతో నమ్మేలా చేయడం కీలకం. తెలంగాణ కాంగ్రెస్ అధిపత్య పోరాటంతో ప్రజలు .. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎవరు సీఎం అవుతారో.. ఎవరు హామీలకు బాధ్యత తీసుకుంటారో ప్రజలకు స్పష్టత ఉండదు. అందుకే ఈ హామీలు పెద్దగా ప్రజల్లోకి వెళ్లవు. అందుకే రేవంత్ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను తెరపైకి తెచ్చారు. ఈ డిక్లరేషన్ల హామీ బాధ్యత మాదని వరు ప్రకటించడంలోనే రేవంత్ వ్యూహం ఉందని చెబుతున్నారు.
సీనియర్లు .. ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డిని నియంత్రించాలని ప్రయత్నిస్తున్నారు. రేవంత్ కూడా వారిపై ఆధిపత్యం చూపించాలని అనుకోవడం లేదు. తగ్గే ఉంటున్నారు. చాన్స్ వచ్చినప్పుడు ఆయన తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. దీంతో సీనియర్ల వెనక్కి వెళ్లిపోతున్నారు. ప్రియాంకా గాంధీ సభతో రేవంత్ కాస్త పైచేయి సాధించారని అనుకోవచ్చు.