జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత వారం హఠాత్తుగా చంద్రబాబు ఇంటికి వెళ్లి కలిశారు. అయితే ఆయన వెంట నాదెండ్ల లేరు. ఒక్కరే వెళ్లారు. మాట్లాడి వచ్చారు. చంద్రబాబుతో కూడా ఇతర నేతలెవరూ లేరు. ఇద్దరే మాట్లాడుకున్నారు. మీడియాతో కూడా మాట్లాడలేదు. పవన్ కల్యాణ్ ఇలా ఒక్కరే వెళ్లడం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పవన్ రాజకీయ సమావేశాలు ఎలాంటివైనా పక్కన నాదెండ్ల మనోహర్ ఉండాల్సిందే. జనసేనలో పవన్ కల్యాణ్ తర్వాత నాదెండ్ల మనోహరే. అన్ని రాజకీయ వ్యవహారాలను ఆయనే చక్క బెడుతున్నారు. కానీ చంద్రబాబుతో చర్చలకు ఆయన లేరు.
అయితే బీజేపీ హైకమాండ్‌తో జరిపిన చర్చలకు నాదెండ్ల కూడా వెళ్లారు.గతంలోనూ చంద్రబాబుతో భేటీలకు నాదెండ్లను పిలువలేదని చెబుతున్నారు. నాదెండ్లకు రాజకీయంగా ప్రాధాన్యం ఇటీవల పవన్ కల్యాణ్ తగ్గిస్తున్నట్లుగా జనసేనలో ప్రచారం జరుగుతోంది. హఠాత్తుగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. సోదరుడు నాగబాబుకు ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. అంటే ఇప్పుడు జనసేనలో నెంబర్ టు ఆయనే అనుకోవచ్చు. నాగబాబు పదవి చేపట్టగానే ముందుగా జనసేన క్యాడర్ మొత్తాన్ని తన గ్రిప్‌లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
జిల్లాలు తిరగడానికన్నా ముందే టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లలోనూ నాదెండ్ల కనిపించడం లేదు. ఆయన వేరేగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నాదెండ్ల ప్రాధాన్యతను వీలైనంతగా తగ్గించడానికే పవన్ కల్యాణ్ నాగబాబుకు బాధ్యతలిచ్చారన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.