ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కొంత మంది సిక్కులు వచ్చి కలిశారు. కత్తి బహుకరించారు. సీఎం జగన్కు ఎంతో ఆనందం వేసి.. వెంటనే వారికి ఏం చేయాలో ఆలోచించి సిక్కు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చేశారు. ఈ హామీ వచ్చిన వారికి ఎలా అనిపించిందో కానీ.. ఇప్పటికే యాభైకి పైగాకార్పొరేషన్లు వేసిన బీసీ కులాలు వారు మాత్రం పగలబడి నవ్వుకుంటున్నారు. ఎందుకంటే కార్పొరే్షన్ ఏర్పాటు చేసి ఏం చేస్తున్నారో వారికి తెలుసు మరి.
కార్పొరేషన్ అనే పేరు పెట్టి… పంపిణీ చేస్తున్న పథకాల్లో ఆయా వర్గాల వారికి ఎంత వస్తుందో లెక్కలు తీసి.. దాన్ని ఆ కార్పొరేషన్ కింద ఇస్తున్నట్లుగా కథలు చెబుతోంది ప్రభుత్వం. వాస్తవంగా ఇలా చేయండ నిధుల మళ్లింపు అవుతుంది. అయితే కార్పొరేషన్ కు రూపాయి కూడా కేటాయించే పరిస్థితి లేకపోవడంతో ఈ మళ్లింపుతోనే రికార్డులు సృష్టించాలని ప్రయత్నిస్తోంది. అమ్మఒడి, రైతు భరోసా లాంటివి అన్ని వర్గాల వారికీ వస్తాయి. ఇలాంటి వారిలో అన్ని కులాల్ని విభజించి … ఆ కులాల జనంకు ఇచ్చిన నగదును కార్పొరేషన్ కిందకు మారుస్తారు.
నిజానికి కార్పొరేషన్ అంటే గతంలో ఓ బలమైన నమ్మకం ఉండేది. ఏ కార్పొరేషన్ అయితే ఆ కులంలో యువతకు ఉపాధి కల్పిస్తుందని నమ్మేవారు. కానీ ఇప్పుడు కార్పొరేషన్లతో ఒక్కరికీ కూడా స్వయం ఉపాధి రుణాలు ఇవ్వడం లేదు.కానీ ప్రచారం మాత్రం.. ప్రపంచంలో ఎవరూ చేయనంతగా తాము ఆయా కులాలకు మేలు చేస్తున్నామని చెప్పుకుంటూ ఉంటారు.