మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్కు సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారు పదవి ఇచ్చారు.ఇప్పటికే రాజీవ్ శర్మ అనే మరో మాజీ సీఎస్ కూడా ముఖ్యసలహాదారు పదవిలో ఉన్నారు. అయితే రాజీవ్ శర్మ పూర్తిగా పాలనా పరమైన వ్యవహారాలను.. సోమేష్ కుమార్ కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఉత్తరాది వ్యవహారాలను చూస్తారన్న ప్రచారం జరుగుతోంది. సోమేష్ కుమార్ కు రాజకీయాలపై చాలా ఆసక్తి ఉంది. ఆయన సర్వేలు కూడా చేయించి కేసీఆర్ కు ఇస్తూంటారు. ప్రశాంత్ కిషోర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
సోమేష్ కుమార్ ను బీఆర్ఎస్ పార్టీని ఉత్తరాదిలో విస్తరించడానికి అమలు చేయాల్సిన ప్రణాళికల్లో కీలకంగా ఉపయోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అసలు సలహాదారు పదవి ఇవ్వాలా లేకపోతే బీహార్ బీఆర్ఎస్ యూనిట్ ఇంచార్జ్ గా పెట్టాలా అనే చర్చ కూడా బీఆర్ఎస్లో సాగిందని చెబుతున్నారు. చివరికి సలహాదారు పదవికే సెటిల్ అయ్యారు. ఇటీవల మహారాష్ట్రలో చేరికలు.. సభల విషయంలో సోమేష్ కుమార్ జోక్యం పరోక్షంగా ఉందంటున్నారు. మూడో బహిరంగసభలో ఆయన కూడా కనిపించారు.
బీహార్ కు చెందిన సోమేష్ హిందీ రాష్ట్రాల బీఆర్ఎస్ బాధ్యతల్ని చూస్తారని .. కేసీఆర్ ప్రణాళికల్ని అమలు చేస్తారని అంటున్నారు. కేబినెట్ హోదా కూడా కల్పించడంతో ఆయనకు మంచి ప్రాధాన్యం ఇచ్చినట్లయిది. కేసీఆర్ హిందీ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ఉనికి కోసం ఇప్పటి వరకూ చేసిందేమీ లేదు. కానీ అంతర్గతంగా ప్రణాళికలు వేస్తున్నరు. సోమేష్ వాటిని కంటిన్యూ చేసి.. నేరుగా రంగంలోకి దిగాలనుకున్నప్పుడు.. క్షేత్ర స్థాయిలో పని చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.