ఇష్రత్ జహాన్ ఎన్ కౌంటర్ ఘటనపై అప్పట్లో నరేంద్ర మోడీపై తీవ్రంగా విరుచుకు పడ్డ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డిఫెన్స్ లో పడింది. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, 2004లో అహ్మదాబాద్ లో ఇష్రత్ జహాన్ అనే 19 ఏళ్ల యువతి, మరో ముగ్గురు యువకులు ఎన్ కౌంటర్లో మరణించారు. వీరు నలుగురూ లష్కరే తయిబా ఉగ్రవాదులని, మోడీ హత్యకు కుట్రలో భాగంగా అహ్మదాబాద్ కు వచ్చారని అప్పట్లో ఇంటెలిజెన్స్ బ్యూరో గుజరాత్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆనాడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉంది.
అప్పట్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఇతర పార్టీల వారికి నరేంద్ర మోడీ పెద్ద టార్గెట్. దాదాపు ప్రతి రో్జూ ఆయన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్న బడా నాయకులూ ఉన్నారు. ఇష్రత్ జహాన్ ఎన్ కౌంటర్ జరగ్గానే అది బూటకపు ఎన్ కౌంటర్ అనే ఆరో్పణలు మొదలయ్యాయి. ఆమె అమాయక యువతి అంటూ కొన్ని ప్రతిపక్షాలు సానుభూతి ఒలకబోశాయి. స్వయంగా పాకిస్తాన్ లోని లష్కరే కరపత్రం లాంటి దినపత్రికలోనే ఇష్రత్ అమర వీరురాలంటూ నివాళులు అర్పించారని మీడియా బయటపెట్టింది. అయినా, ప్రతిపక్షాల ఆరో్పణలు ఆగలేదు.
ఇష్రత్ జహాన్ ఉగ్రవాది కాదని, అది బూటకపు ఎన్ కౌంటర్ అని దాఖలైన పిల్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. తర్వాతి కాలంలో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. 2009లో హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ను మార్చారని, దీనికి కారణం రాజకీయ ఒత్తిడేనని అప్పటి హోం సెక్రటరీ పిళ్లై బాంబు పేల్చారు. ఆనాటి హోం మంత్రి పి. చిదంబరం రహస్యంగా అఫిడవిట్ ను తెప్పించుకుని మార్పులు చేశారని, దానినే కోర్టులో సమర్పించామని ఆయన చెప్పారు. ఇది రాజకీయంగా కలకలం రేపింది. కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందంటూ బీజేపీ విమర్శిస్తోంది. ఇది అంతటితో ఆగలేదు. అప్పట్లో తనను హింసించి అఫిడవిట్ పై సంతకం చేయించారంటూ ఆనాటి అండర్ సెక్రటరీ మణి వెల్లడించడం దుమారం రేపింది. దీనిపై పార్లమెంటులో బీజేపీ సభ్యులు భగ్గుమన్నారు. కాంగ్రస్ పై మండిపడ్డారు.
2009 ఆగస్టులో సమర్పించిన అపిడవిట్లో ఇష్రత్ జహాన్ బృందం లష్కరే ఉగ్రవాదులంటూ ఐబీ ఇన్ పుట్స్ పంపిందనే వివరాలున్నాయి. రెండు నెలల తర్వాత చిదంబరం మార్పులు చేశాక సమర్పించిన అఫిడవిట్లో ఆ వివరాలు లేవు. ఇష్రత్ లష్కరే ఉగ్రవాది అనడానికి తగిన ఆధారాలు లేవనే వాక్యాన్ని జోడించారు. ఇది జాతి వ్యతిరేక చర్య అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆరోపించారు. చిదంబరం ఉగ్రవాదులకు సహకరించారని విమర్శించారు.
చిదంబరం చర్య కాంగ్రెస్ ను ఇరుకున పెట్టింది. లోక్ సభలో కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే కూడా చిదంబరాన్ని ఏకపక్షంగా సమర్థించలేక పోయారు. దీనిపై తన దగ్గర ఎక్కువ వివరాలు లేవని మీడియాతో అన్నారు. అన్ని వివరాలను చిదంబరమే చెప్తే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం ఇది రాజకీయ కుట్ర అని ఆరోపిస్తున్నారు. అయితే, మోడీని ఇరుకున పెట్టడానికి ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నాయనే బీజేపీ ఆరోపణను కౌంటర్ చేయడం కాంగ్రెస్ కు సవాలుగా మారింది. స్వయంగా ఆనాటి రెండు అఫిడవిట్లపై సంతకం చేసిన మణి ప్రకటనతో చిదంబరం షాకై ఉంటారు. మరి ఆయన ఈ వివాదం నుంచి ఎలా బయటపడతారో, కాంగ్రెస్ ను ఎలా బయటపడేస్తారో చూడాలి.