కర్ణాటక ఎన్నికల ఓటింగ్ పూర్తయిన తర్వాత విజయం మాదంటే మాదని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ చెబుతున్నాయి కానీ కుమారస్వామి మాత్రం ముందే చేతలెత్తేశారు. ఇరవై ఐదు సీట్లలో గెలుపు సాధించలేకపోతున్నామని దానికి.. డబ్బులు లేకపోవడమే కారణమని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని కన్నడ మీడియాలోనూ హైలెట్ అయింది.. తెలుగు రాజకీయాలు ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లోనూ చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే.. ఇంతకు ముందు బీఆర్ఎస్ ఆర్థిక అవసరాలన్ని కేసీఆర్ చూస్తారన్న ప్రచారం జరగడమే.
భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు కేసీఆర్ ఇతర పార్టీలను దగ్గరకు తీసుకున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కలిసి పని చేద్దామని ఆర్థిక సాయం చేస్తామని ఆశ పెట్టడంతో కుమారస్వామి కేసీఆర్ ఎన్ని సార్లు పిలిచినా హైదరాబాద్ వచ్చారు. ఆయన కుమారుడ్ని కూడా తీసుకు వచ్చారు. కానీ ఏమయిందో కానీ కర్ణాటక ఎన్నికల వైపు తిరిగి చూడలేదు కేసీఆర్. కనీసం చెప్పినట్లుగా కుమారస్వామికి ఆర్థిక సాయం కూడా చేయలేదు. ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.
కేసీఆర్ ఇటీవలి కాలంలో సైలెంట్ గా ఉంటున్నారు. కారణం ఏదైనా ఆయన బీజేపీకి భయపడుతున్నారని.. తెల్ల జెండా ఎగురవేశారని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఆయన జాతీయ రాజకీయాలపై మాట్లాడటం లేదు. ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ప్రారంభించి.. అక్కడ ఉండకుండా ఎవరితోనూ మాట్లాడకుండా వచ్చేశారు. మరో వైపు కవిత పై ఢిల్లీ లిక్కర్ స్కాంలో చాలా ఆధారాలున్నాయని ఈడీ కోర్టుకు సమర్పించింది. ఇంత చేసి బీజేపీకి కోపం తెప్పించడం ఎందుకని ఆయన సైలెంట్ గా ఉన్నారా అన్న చర్చ ప్రారంభమయింది.