మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య వాదులకు అనేక సందేహాలను ఇస్తోంది. మహారాష్ట్ర సంక్షోభంలో గవర్నర్, స్పీకర్లు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని సుప్రీంకోర్టు తేల్చింది. అంటే వారి సాయంతో ఏర్పడిన ప్రభత్వం రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పడినట్లే. ఉద్దవ్ ధాకరే అవిశ్వాస పరీక్ష ఎదుర్కోకుండానే రాజీనామా చేసినందున ఆయన ప్రభుత్వాన్ని మళ్లీ ఏర్పాటు చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంత వరకూ ఓకే కానీ మరి రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కొనసాగించడం ఎంత వరకు సబబు అనేది ఎక్కువ మందికి వస్తున్న సందేహం. ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి కేసును బదిలీ చేసినప్పటికీ.. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొనసాగుతుంది.
మహారాష్ట్రలో శివసేన పార్టీ అంతు చూసేందుకు నిర్వహించిన ఆపరేషన్ కమల్లో షిండే్ కీలక పాత్ర పోషించారు. బీజేపీ మద్దతుతో శివసేనలోని 40 మంది ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకున్నారు. గవర్నర్ కు లేఖ శారు. నిజానికి ఓ పార్టీలో అసమ్మతి ఎమ్మెల్యేలు లేఖ రాస్తే అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని గవర్నర్ ఆదేశించడం రాజ్యాంగ విరుద్ధం. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అంటూ ఒకటి ఉంది. ఓ గుర్తుపై ఎన్నికైన వారు పార్టీని ధిక్కరిస్తే.. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే వారిపై అనర్హతా వేటు వేయవచ్చు. కానీ ఇక్కడే వ్యవస్థలన్నీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించాయి. చీఫ్ విప్ గా తమ వారిని నియమించుకుని.. తమదే అసలైన పార్టీ అన్నట్లుగా శిందే వర్గం రుబాబు చేసింది. చివరికి ఈసీ కూడా అసలైన శివసేన శిందేదేనని తీర్పు ఇచ్చింది.
కానీ ఇప్పుడు రాజ్యాంగధిక్కరణ జరిగిందని.. గవర్నర్, స్పీకర్ తప్పు చేశారని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇప్పుడు ఉద్దవ్ ధాకరేకు ఏ విధంగానూ న్యాయం జరిగే అవకాశం లేదు.చివరికి పార్టీని కూడా అసలైన శివసేన శిందే వర్గానిదని తీర్పు ఇచ్చేశారు. ఇప్పుడు చేయగిలగింది.. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడం…ఆ ఉల్లంఘనల లబ్దిదారుల్ని పదవుల నుంచి దించడం మాత్రమే.
మన దేశ రాజకీయాల్లో నైతికత అనేదానికి తావు లేదు. సుప్రీంకోర్టు అభిశంసించినా.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని తేలినా పదవుల నుంచి వైదొలగరు. హమ్మయ్య.. తప్పు చేశామని చెబితే చెప్పింది… మా పదవుల నుంచి ఊడబీకలేదు అని శిందే, ఫడ్నవీస్ తర్వాత సంతృృప్తి పడ్డారు. అదే నైతికత లేని రాజకీయం. మహారాష్ట్ర సంక్షోభం దేశ ప్రజాస్వామ్యానికి కొత్త పాఠాలు నేర్పుతోంది.