జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ కాపు నేతల దాడి తీవ్రం అయింది. ఆయన కాపుల్ని చంద్రబాబు, టీడీపీకి తాకట్టు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇలా ఆరోపిస్తున్న వారు వైసీపీలో పదవుల కోసం పూర్తి బానిసత్వం చేస్తూ సొంత వ్యక్తిత్వం అనేది కూడా లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు కళ్ల ముందే ఉంది. అయినా వారు పవన్ ను కాపులకు ముడి పెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు.
పవన్ ఓటింగ్ కాపులేనని కాపు మంత్రులు ఎందుకు చెబుతున్నారు ?
పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కాపుల గురించి వైసీపీ కాపు మంత్రులు మాట్లాడుతున్నారు. కాపులు సీఎం కావాలని కోరుకుంటున్నారని కానీ పవన్ సీఎం అవ్వాలనుకోవడం లేదని చెప్పుకొస్తున్నారు. పవన్ కల్యాణ్ కూడా తన ప్రసంగంలో ఇదే చెప్పారు. తాను ఏదైనా మాట్టాడగానే బుడతల్ని రంగంలోకి దించుతారని.. వారికి ఎందుకు సీఎం పదవి ఇవ్వరని ప్రశ్నించారు. అయితే అయనపై వైసీపీ కాపు సామాజికవర్గ నేతల దాడి మాత్రం లేదు. అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు విమర్శలు చేస్తూనే ఉన్నారు. పవన్ కాపులకే పరిమితమన్నట్లుగా మాట్లాడుతున్నారు.
పవన్ పొత్తులతో జగన్ రెడ్డి అధికారం పోతే ఈ కాపు నేతలకెందుకు బాధ ?
పవన్ కల్యాణ్‌కు అన్ని వర్గాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్క కాపులు ఆదరిస్తేనే ఆయన సూపర్ స్టార్ కాలేదు. ఆ విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ కాపులకే పరిమితం చేసేందుకు మంత్రులు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా ఎందుకంటే.. జనసేన, టీడీపీ పొత్తులు పెట్టుకుంటే జగన్ రెడ్డి అధికారం ఎక్కడ పోతుందోననేది వారి ఆందోళన. ఇంత బానిసత్వం ఎందుకన్న ప్రశ్న సొంత వర్గం నుంచే వస్తోంది.
టీడీపీతో కలిస్తే జనసేనకు అధికారంలో భాగం !
గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. అప్పట్లో ఆ పార్టీకి కాపు వర్గం అండగా నిలబడలేదు. చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. ఆరు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. గెలిచే అవకాశం లేదు కాబట్టి ఓటు వృధా పోతుందన్న ఉద్దేశంతో ఎక్కువ మంది జనసేన అభిమానులు కూడా ఓట్లు వేయలేదని విశ్లేషకులు అంచనా వేశారు. ఈ సారి పవన్ కల్యాణ్.. టీడీపీతో జత కట్టాలని నిర్ణయించుకున్నారు. కూటమి గెలిస్తే..జనసేన పార్టీకి ఖచ్చితంగా అధికారంలో భాగం లభిస్తుంది. కాపు వర్గం కోరుకునే అధికారం లభిస్తుందన్న కారణంగా వారి ఓటు బ్యాంక్ జనసేన వైపు కన్సాలిడేట్ అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదే వైఎస్ఆర్సీపీకి ఆందోళన కలిగిస్తోంది. అందుకే పిచ్చిపట్టినట్లుగా పవన్ పై వ్యాఖ్యలు చేస్తున్నరన్న వాదన వినిపిస్తోంది.
పవన్ పై దూషణలతో వైసీపీకి కాపు వర్గం మరింత దూరం !
అయితే రాజకీయ విమర్శలు వేరు.. వ్యక్తిగత విమర్శలు వేరు. వైసీపీ నాయకులు రాజకయ విమర్శలను.. వ్యక్తిగత విమర్శలను కలిపేశారు. ఇంకా చెప్పాలంటే కేవలం వ్యక్తిగత విమర్శలే చేస్తున్నారు. అవి కూడా పవన్ కల్యాణ్ ను కించ పరిచేలా ఉంటున్నాయి. ఆయన వ్యక్తిగత జీవితం దగ్గర్నుంచి అన్నీ మాట్లాడుతున్నారు. ఇది కూడా వైఎస్ఆర్సీపీ నేతలపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి మరో కారణం అవుతోందని చెబుతున్నారు.