కర్ణాటక ఎన్నికల్లో తెలుగు వచ్చిన , తెలుగు మాట్లాడే ఓటర్లు ఎవరూ బీజేపీకి ఓటేయలేదు. గతంలో కర్ణాటక ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీ నేతలు బీజేపీకి ఓటు వేయవద్దని జోరుగా ప్రచారం చేశారు. ఈ సారి ఎవరూ ప్రచారం చేయలేదు. వైసీపీ అంతర్గతంగా సహకరించింది. బీఆర్ఎస్ కూడా బీజేపీని ఓడించమని పిలుపునివ్వలేదు. కానీ తెలుగు ఓటర్లు మాత్రం బీజేపీకి కర్రు కాల్చివాతలు పెట్టారు.
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోనూ తెలుగు ప్రజలు ఉన్నారు. అలాగే మరికొన్ని చోట్ల తెలుగు వారున్నారు. దాదాపుగా ఎనిమిది జిల్లాల్లో తెలుగువారు ఎక్కువగా ఉంటారు. ఆ ఎనిమిది జిల్లాల్లో కలిపి మొత్తం 49 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే అందులో బీజేపీ గెల్చుకుంది కేవలం ఆరు సీట్లనే. మొత్తం ఎనిమిది జిల్లాల్లో కోలార్ , యాద్గిర్, చిక్ బళ్లాపూర్ బళ్లారి జిల్లాలో కూడా బీజేపీ ఖాతాలో ఒక్క సీటు కూడా పడలేదు. ఈ ఫలితాలు బీజేపీ హైకమాండ్ ను కూడా ఆశ్చర్య పరిచాయని అనుకోవచ్చు.
అయితే తెలుగు ఓటర్లు బీజేపీకి ఓటు వేయకపోవడానికి కర్ణాటక రాజకీయాలే కారణం కానీ.. తెలుగు రాజకీయాలు వారిని ప్రభావితం చేసి ఉండవని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉండటం వల్లే వారు కాంగ్రెస్ కు ఓటు వేశారని అంటున్నారు. నిజానికి తెలుగురాష్ట్రాల తరహాలో కాకపోయినా.. తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో బీజేపీ అంత బలంగా ఎప్పుడూ లేదు. కానీ ఈ సారి అధికార పార్టీగా పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తుందని అనుకున్నారు. కానీ తెలుగు ఓటర్లు పడనీయలేదు.