ఆంధ్రప్రదేశ్ బీజేపీకి క్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది. టీడీపీతో కలిసి రావాలని జనసేన ఒత్తిడి చేస్తోంది. టీడీపీ కూడా అదే చేస్తోంది. అయితే వైసీపీ మాత్రం మేమున్నాం కదా ఇతర పార్టీలతో ఏం పని గట్టిగా పట్టుకుంటోంది. ఇక్కడే ఏపీ విషయంలో కేంద్ర బీజేపీ నాయకత్వానికి ఏ విషయం అంతుబట్టడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే.. ఏదో ఓ పార్టీతో కలిసి వెళ్తే మరో పార్టీ వ్యతిరేకం అవుతుంది.
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పొత్తులు పెట్టుకోవాలంటే కేంద్ర రాజకీయాలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీలో పొత్తులు పెట్టకోవడం అనేది కేవలం.. ఏపీ రాజకీయాల మీద ఆధారపడి లేదు. ఏపీలో పొత్తులు ఉన్నాలేకపోయినా బీజేపీకి వచ్చే సీట్లు పెద్దగా ఉండవు. కానీ కేంద్రంలో మాత్రం ఇక్కడ గెలిచే ప్రాంతీయ పార్టీకి చెందిన ఎంపీలు మద్దతుగా ఉండాల్సి ఉంటుంది.
బీజేపీకి ఉత్తరాదిలో గత రెండు సార్లు తిరుగులేని మెజార్టీ వచ్చింది. ఈ సారి అలాంటి ఫలితాలు కష్టమే. ప్రతీ సారి అదే ఫలితాల ఆశించడం అత్యాశే. బీజేపీకి అక్కడ తగ్గే సీట్లు దక్షిణాదిలో కవర్ చేసుకోవాలి.
అలాంటి మిత్రపక్ష పార్టీల్లో బీజేపీకి కనిపించే మొదటి పార్టీ టీడీపీ. ఎందుకంటే గతంలో బీజేపీతో చాలాసార్లు కలిసింది. ఎంత సహకరిస్తున్నా వైసీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోదు. అలా పెట్టుకుంటే వైసీపీ కోర్ ఓటు బ్యాంక్ దూరం అవుతుంది. నేరుగా కాకుండా పరోక్షంగా బీజేపీతోనే ఉంటామని వైసీపీ భరోసా ఇస్తుంది. కానీ టీడీపీ నేరుగా కలుస్తుంది. బీజేపీ ఎవర్ని నమ్ముతుందన్నది ఇక్కడ కీలకం. ఒక వేళ మధ్యేమార్గంగా వ్యవహరించి తటస్థంగా ఉండే.. రెండు పార్టీలు కేంద్రంలో బీజేపీకే సపోర్ట్ చేస్తాయి . ఏదో ఓ కూటమితో కలిస్తే మరో పార్టీ వ్యతిరేకం అవుతుంది.
అందుకే ఏపీ విషయంలో బీజేపీ తటస్థంగా వ్యవహరిస్తేనే పాతిక ఎంపీ సీట్లలో తమకు మద్దతు లభిస్తుందని.. ఎవరో ఒకరి వైపు ఉంటే ఇబ్బంది అవుతుందని కొన్ని వర్గాలు కేంద్ర నాయకత్వానికి సలహాలిస్తున్నాయి.