చంద్రబాబు ఉంటున్న లింగమనేని ఇల్లు, నారాయణకు చెందిన ఇతర ఆస్తుల్ని జప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ ఉపయోగించిన చట్టాలను చూసిన న్యాయనిపుణులకు మైండ్ బ్లాంక్ అవుతోంది. ఇంత అడ్డగోలుగా వారు చెప్పిన చట్టాలనే ఉల్లంఘిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటన్నది వారి డౌట్. అసలు ప్రైవేటు ఆస్తుల్ని జప్తు చేయడానికి ప్రత్యేకమైన కారణాలు ఉండాలి. వేటిని పడితే వాటిని జప్తు చేయరాదు.
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జప్తు ఉత్తర్వులు.. ఉదహరించిన బ్రిటిష్ కాలం నాటి ఆర్డినెన్స్.. వాటిలో సెక్షన్లు చూసిన వారికి ఉద్దేశపూర్వకంగానే ఏదో ఒకటి చేయాలన్న కసితోనే ఈ జప్తు గేమ్ ఆడుతున్నట్లుగా స్పష్టమవుతుంది. ముందుగా ఏదైనా నేరం జరిగినట్లుగా సాక్ష్యాలు చూపించాలి. ఆ నేరంలో సర్క్యూలేట్ అయిన డబ్బుల వల్ల జప్తు చేయబోయే ఆస్తులు కొనుగోలు చేశారని నిర్ధారించాలి. ఆ తర్వాత వాటిని న్యాయమూర్తి ముందు పెట్టి జప్తు ఆదేశాలు తెచ్చుకోవాలి. అంతే కానీ నేరుగా అటాచ్ చేయడం చెల్లదు. అన్నీ తెలిసి సీఐడీ అధికారులు ఈ చర్యలు ఎందుకు తీసుకున్నారో … ప్రభుత్వ పెద్దలకు తెలుసు. ఇప్పుడు కోర్టులో ఏం జరగబోతోందో ఈ సెక్షన్లు, చట్టాల గురించి తెలుసిన వారికి అర్థం అవుతుంది.
హఠాత్తుగా ఇలా లింగమనేని ఇంటిని జప్తు చేయడానికి కారణం.. ఏదో పెద్ద డైవర్షన్ గేమ్ ఆడటమేనని భావిస్తున్నారు. వివేకా హత్య కేసులో సంచలనాలు నమోదవబోతున్నాయని కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత దూకుడు మీద సీబీఐ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సీబీఐ రంగం సిద్ధం చేసిందనే సమాచారం అంది ఉంటుందని.. ప్రతిగా ప్రచారం చేసుకోవడానికి మరో కేసును తెరపైకి తెచ్చారన్న వాదన వినిపిస్తోంది.
అసలు కొసమెరుపేమిటంటే అసలు ఇన్నర్ రింగ్ రోడ్ అనేదేలేదు. అలైన్ మెంట్ ప్రకారం ఒక్క గజం సేకరించలేదు. ఇంకా అధికారిక పనులే ప్రారంభం కాలేదు. కానీ అవినీతి అంటూ కేసు పెట్టి..ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున చేస్తున్నారు.