తెల్లవారు జామున నాలుగు గంటలకు లేచి.. రాత్రి పదకొండు గంటల వరకూ అలుపెరుగని శ్రమ. గంట పాటు సెల్ఫీలు, ప్రతీ చోటా సమస్యలు తెలుసుకోవడం. భరోసా ఇవ్వడం. పార్టీ పరిస్థితిని చక్కదిద్దే ఆలోచనలు చేయడం. . గత వంద రోజులుగా నారా లోకేష్ దినచర్య ఇది. వంద రోజుల క్రితం కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర వంద రోజుల మైలురాయికి చేరుకుంది. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర గురించి ట్రోల్ చేయాడనికి ఎవరికీ ధైర్యం లేదు. ఆయన పాదయాత్రలో జనాల్లేరని చెప్పడానికి ఎవరికీ చాన్స్ దొరకడం లేదు. ఆయన స్పీచుల్లో ఎక్కడైనా మాట తప్పు దొర్లితే దాన్ని తీసుకుని పండగ చేసుకుందామని అలా వైసీపీ సోషల్ మీడియాలో ఆఫీసులో వందల మంది చూస్తూనే ఉన్నారు. కానీ ఏమీ దొరకక అనని మాటల్ని అన్నట్లుగా ఎడిట్ చేసుకుని భావ ప్రాప్తి పొందుతున్నారు. వంద రోజుల పాదయాత్ర లో లోకేష్ తెచ్చిన ..తెచ్చుకున్న మార్పుకు ఇంత కన్నా పెద్ద సంకేతం ఏముంటుంది ?
కుట్రలు, కుతంత్రలాలను చేధించి పాదయాత్ర!
లోకేష్ రాజకీయాల్లోకి రాక ముందు నుంచి విపక్ష వైసీపీకి టార్గెట్. ఆయనపై సాఫ్ట్ ముద్ర వేశారు. బొద్దుగా.. నీట్ షేవింగ్ తో ఉండే ఆయన రూపాన్ని అవహేళన చేశారు. ఆయన తెలుగును ట్రోల్ చేశారు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోకి అసలు ఎంట్రీ ఇవ్వకుండానే టార్గెట్ అయిన నేత లోకేష్ ఒక్కరే. ఆయన ఇమేజ్ ను నాశనం చేయడానికి వందల కోట్లు పెట్టి సోషల్ సైన్యాలను నడిపారు. కుప్పంలో పాదయాత్ర ప్రారంభించిన తర్వాత ఇంటలిజెన్స్ పోలీసులు.. వైసీపీ సోషల్ మీడియా మూక.. బూతుల నేతలు ఎంతగా చెలరేగిపోయారో అర్థం చేసుకోవచ్చు. పాదయాత్ర ఆపేస్తారంటూ ప్రచారం చేశారు. చివరికి అది అన్ స్టాపబుల్‌గా వంద రోజులు చేసుకుంది.
అడుగడుగునా ప్రజలతో మమేకం !
పాదయాత్ర లక్ష్యం సమస్యలు తెలుసుకోవడం.. తక్షణం ఎవరికైనా పరిష్కారం కావాలంటే చేయడం. లోకేష్ దీన్నివంద శాతం చేసి చూపిస్తున్నారు. ఉదయం పూట ఆయన గంట పాటు కనీసం వేయి మందికి సెల్ఫీలు ఇస్తారు. నిజానికి.. ఒక్కటి.. రెండు సెల్ఫీలు తీసుకుంటే ఎవరికైనా చిరాకు వస్తుంది. కానీ లోకేష్ గంటపాటు అలా సెల్ఫీలు ఇస్తారంటే ఆ సహనాన్ని అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు తన కోసం వచ్చిన వారితో సావధానంగా మాట్లాడారు. ఈ వంద రోజుల కాలంలో ఆయన ఎవరినీ విసుక్కున్న సందర్భం ఒక్కటి కూడా లేదు. ఎంతో మందికి సాయం చేశారు. మైలురాయి అందుకున్న ప్రతీ చోటా ఓ శిలాఫలకం పెట్టి .. అమలు చేస్తానన్న హామీల గురించి చెబుతున్నారు. ఇదో వినూత్న ప్రక్రియ.
ఇప్పటికి మూడు జిల్లాలే .. కానీ ఎంతో మార్పు !
వంద రోజుల్లో లోకేష్ మూడు జిల్లాల్లోనే పాదయాత్ర చేశారు. అంటే మరుమూల ప్రాంతాల్లో ఎలా పర్యటించారో అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా 39 నియోజకవర్గాలను కవర్ చేశారు. నాలుగు వందల రోజుల పాటు సిక్కోలు వరకూ పాదయాత్ర సాగుతుంది. రాయలసీమలోనే ఇంత ప్రభంజనం ఉంటే ఇక కోస్తాకు వచ్చే సరికి ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పడం కష్టం. కానీ ఇప్పటికే ఆయన సాధించిన మార్పు.. క్యాడర్ లో తెచ్చిన హుషారు అంతా ఇంతా ఇంత కాదు.
వంద రోజుల్లోనే లోకేష్ .. అంచనాలను తలకిందులు చేశారు. ఇంకా మూడువందల రోజులు ఉంది. శిఖరాన పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకునేందుకు అడుగులు వేస్తూనే ఉంటారు.