చిత్రసీమలో మాట మీద కంటే… హిట్టు మీద నిలబడే వాళ్లే ఎక్కువ. ఎవరికి హిట్ ఉంటే వాళ్ల మాటే చెల్లుబాటు అవుతుంది. వాళ్ల చుట్టూనే ఇండస్ట్రీ మొత్తం తిరుగుతుంటుంది. సినిమా చేస్తానని మాట ఇచ్చి – దాన్ని నిలుపుకోవడం కూడా ఈ రోజుల్లో పెద్ద విషయమే. రామ్… ఈ విషయంలో తన నిజాయతీ నిరూపించుకొన్నాడు.
లైగర్ తరవాత.. పూరి జగన్నాథ్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. చేతిలో కథలు ఉన్నాయి కానీ, హీరోనే లేడు. చిరంజీవి, బాలకృష్ణ అంటూ… తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆఖరికి విశ్వక్సేన్ కూడా `చూద్దాం.. చేద్దాం` అనే స్థితికి వచ్చేశాడు. బాలీవుడ్ లో ఓ హీరో కోసం విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు పూరి. ఎట్టకేలకు తన ట్రంప్ కార్డ్‌ని రామ్ రూపంలో వాడేశాడు. ఇస్మార్ట్ శంకర్ తో రామ్ కి ఓ తిరుగులేని విజయాన్ని అందించాడు పూరి. అప్పుడే.. ఈ సినిమాకి సీక్వెల్ చేయాలన్న ఆలోచన వచ్చింది. కానీ.. పూరి పాన్ ఇండియా కథల మత్తులో పడిపోయాడు. లైగర్, జనగణమన అంటూ పెద్ద ప్రాజెక్టులు పట్టాడు. లైగర్ ఫ్లాప్ ప్రభావం జనగణమన పై పడింది. దాంతో.. ఆ సినిమా ఆగిపోయేది. లైగర్ హిట్టయితే.. జగనగణమన మొదలెట్టేవాడు పూరి. ఈ విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలూ లేవు. అప్పుడు రామ్ సంగతే ఆయనకు గుర్తుకు ఉండేది కాదు. ఇప్పుడు అనుకోని పరిస్థితుల్లో మళ్లీ రామ్ దగ్గరకే వచ్చాడు. రామ్ కి కూడా పూరి అంటే అభిమానం. తన కెరీర్‌కి ఇస్మార్ట్ శంకర్ అంత హెల్ప్ చేసింది. అందుకే పూరి అడిగిన వెంటనే, అప్పుడెప్పుడో ఇచ్చిన మాట గుర్తొచ్చి, దాన్ని నిలబెట్టుకొన్నాడు. అంతేకాదు.. ఈ ప్రాజెక్ట్ కి పూరినే నిర్మాత. అందుకే పారితోషికం ఎంతని కూడా అడగలేదట. ఈ విషయంలో రామ్ రియల్ హీరో అనిపించురకొన్నాడు. బోయపాటి శ్రీను సినిమా పూర్తయిన వెంటనే ఈ సినిమాని పట్టాలెక్కించేస్తారు.