ముందు అనుకున్న షెడ్యూలులోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా 2016-17 బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టుకి 4 లేదా 5 వేల కోట్లరూపాయలు కేటాయించాలని, రాజధాని నిర్మాణానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని భావిస్తున్నారు. ఇప్పటికే సిద్ధమైపోయిన బడ్డెట్ ప్రతిపాదనలను ఈ మేరకు మార్చే పనిలో ఆర్ధికశాఖ అధికారులు తలమునకలై వున్నారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టుకి కేంద్ర బడ్జెట్ లో ఈసారి భారీగా నిధులు వస్తాయన్న అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం సొంతనిధులను కేటాయించలేదు.
విభజనచట్టంలో పొందుపరచిన పోలవరం ప్రాజెక్టు, ఏడు వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధులు, రాజధాని నిర్మాణం నిధుల ప్రస్తావన కూడా కేంద్రబడ్జెట్ లో లేదు. ఢిల్లీ నుంచి నిధులు వచ్చేవరకూ వేచి వుంటే అత్యంత కీలకమైన నిర్మాణాలు, అభివృద్ధి నిలచిపోతాయి కనుక, జాప్యం జరిగే కొద్దీ నిర్మాణ వ్యయాలు పెరిగిపోవడం ఆర్ధిక కోణంలో భారమౌతుంది. నెరవేర్చలేని వాగ్దానాల వల్ల విశ్వసనీయత కోల్పోయి తెలుగుదేశం రాజకీయంగా నష్టపోతుంది. ఈ నష్టాల నివారణకు తక్షణం సొంతనిధులు వెచ్చించి షెడ్డూలు ప్రకారమే 2018 కల్లా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని చంద్రబాబు భావిస్తున్నారు. జాప్యం జరుగకుండా పనులు కొనసాగించడానికి రాష్ట్రనిధుల నుంచి ఈ ఏడాది నాలుగు లేదా ఐదువేలకోట్ల రూపాయలు కేటాయించి, తరువాత కేంద్రం నుంచి రాబట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. ముఖ్యమంత్రి, ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు చర్చించుకుని ఈ మేరకు మార్పులు చేయిస్తున్నారు.
గత ఏడాది కన్నా ఈసారి నీటి పారుదల, నదుల అనుసంధానానికి నిధులు పెంచుతూ ఇప్పటికే రాష్ట్రబడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఇపుడు అందులో ప్రాధాన్యతలను రీ షెడ్యూలు చేసి ఆ నిధులను పోలవరానికి బదలాయించే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోరది.
ఏ రంగాలకు ఎంతెంత కోతలు పెట్టాలన్నదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోంది. జీతాలు, పింఛన్లకు ఎక్కువ నిధులు కావాల్సిన తరుణంలో ప్రణాళికేతర బడ్జెట్లో మార్పులు చేసే అవకాశాలు లేవు. ఇందువల్ల ప్రణాళికా రంగంలోనే ఏ కోతలన్నా విధించవలసి వుంటుంది.
ఇదే జరిగితే మిగిలిన చిన్న చిన్న ప్రాజెక్టులకు, తొలి దశలో ఉన్న ప్రాజెక్టులకు నిధులు నిలిపివేసే అవకాశాలు వుంది. రాజధాని నిర్మాణానికి కేంద్రం గత ఏడాది ఇచ్చిన 1800 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదు. ఆమొత్తాన్ని కూడా ఈ ఏడాది ఖర్చు చేస్తారు.
చట్టబద్దంగా ఇవ్వవలసిన నిధుల విషయంలోనే సాచివేత, అహంకారపూరిత, అవమానకరమైన ధోరణులతో వున్న కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నిర్ణయం ఘాటైన సమాధానమే అవుతుంది. కేంద్రరాష్ట్రసంబంధాలపై బిజెపి సారధ్యం లోని ఎన్ డి ఎ ప్రభుత్వాన్ని బోనెక్కించే పంచాయితీకి పోలవరం ప్రాజెక్టు కేంద్రబిందువు అవుతుంది.