సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఎలాంటి ఆటంకాలు లేవు. అంతేనా చేయి చాపితే అందే అంత దూరం ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడి ఓ గంట ముందే చేరుకుంటున్నారు. కానీ అరెస్ట్ మాత్రం చేయడం లేదు. ఈ టెన్షన్ భరించలేక అవినాష్ రెడ్డి హైకోర్టు టు సుప్రీంకోర్టు తిరుగుతూనే ఉన్నారు. తాజాగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీబీఐ నోటీసులు జారీ చేయడంతో అరెస్ట్ చేస్తారనే భయంతో ముందస్తు షెడ్యూల్ కారణంగా రావడం లేదని సమాచారం పంపి.. ఇటు నుంచి ఇటు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు.
ఉదయమే.. సుప్రీంకోర్టు ప్రారంభం కాగానే వైసీపీ రాజ్యసభ ఎంపీ, జగన్ కు సంబంధించిన పలు రకాల అక్రమాలు, దారుణాల వంటి కేసుల్లో ఆయన తరపున న్యాయవ్యవహారాలు చక్కబెట్టే నిరంజన్ రెడ్డి చీఫ్ జస్టిస్ ముందు అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ గురించి మెన్షన్ చేశారు. అప్పటి వరకూ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టు లో పిటిషన్ వేశారనే సంగతి ఎవరికీ తెలియదు. అయితే విచారణకు తేదీ ఇవ్వడానికి చీఫ్ జస్టిస్ నిరాకరించారు. అత్యవసరం అయితే రాతపూర్వకంగా ఇవ్వాలని దాన్ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ అత్యవసర పిటిషన్లను మాత్రమే విచారణ జరుపుతుంది. ఇప్పుడు అత్యవసరంగా విచారణ జరపాలని అవినాష్ రెడ్డి కోరే అవకాశం ఉంది. అయితే అసలు విషయం ఏమిటంటే.. ఇంతకు ముందు సుప్రీంకోర్టే.. హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేస్తూ.. మరోసారి విచారణ జరపాలని ఆదేశాలిచ్చింది. ఇప్పుడు మళ్లీ ముందస్తు బెయిల్ కావాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లడం అవినాష్ రెడ్డి అండ్ కో న్యాయవ్యవస్థ విషయంలో ఎంత క్లారిటీగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.
ముందస్తు బెయిల్ తీసుకున్నా.. తీసుకోకపోయినా.. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం సీబీఐకి ఇష్టం లేదనే వాదన వినిపిస్తోంది. కేసులో కదలిక ఉన్నట్లుగా ఈ పరిణామాలు ఇలా సాగిపోతూనే ఉంటాయని చెబుతున్నారు.